వైరాటౌన్, మే 15 : ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టును ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తామని, రైతుల సాగు భూములకు నీరందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఏన్కూరు మండల కేంద్రంలో సీతారామ ప్రాజెక్టు కాల్వ పనులను ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌తో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెయిన్ కెనాల్ నాలుగు పంప్‌హౌస్‌లతోపాటు మేజర్ పనులన్నీ పూర్తయ్యాయని, సీతారామ ప్రాజెక్టు నీటిని వైరా రిజర్వాయర్‌కు తరలించి ఆయకట్టు భూములకు ఈ ఏడాది నుంచే నీరందిస్తామన్నారు.
కృష్ణా జలాలు మనకు రాకపోయినా గోదావరి జలాల ద్వారా కృష్ణా ఆయకట్టు కింద పంటలు పండించుకోవడంతోపాటు వైరా రిజర్వాయర్ ద్వారా తాగునీటితోపాటు ఆయకట్టు భూములకు నీరందిస్తామని తెలిపారు. అలాగే మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలోని భూములకు లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను వివరించగానే ముఖ్యమంత్రి స్పందించి త్వరగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు పనులు మొదలు పెట్టామని, రైతులకు కొంత ఇబ్బంది జరిగినా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు.