కొత్తగూడెం అర్బన్, జూన్ 3 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదునెలలైనా ఏ ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం కొత్తగూడెం పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయజెండా, పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ రధసారథి కేసీఆర్ జాతీయ ఉద్యమాన్ని నడిపిన తీరు, ఉద్యమ ఘట్టాలను ఎల్ఈడీ ద్వారా ప్రదర్శింపజేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. నాడు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు తమ అనుభవాలను వివరించారు. ఉద్యమం జరిగిన తీరు, మాజీ సీఎం కేసీఆర్ అనుసరించిన విధానాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చేసిన కృషిని తెలిపారు. అనంతరం రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారం కోల్పోయినంత మాత్రాన కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వచ్చిచేరిన నాయకులు పదవులు అనుభవించి వెళ్లిపోయారని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కష్టపడి పనిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు పాటుపడదామన్నారు. క్షేత్రస్థాయి, గ్రామ కమిటీలు, పట్టణ కమిటీలు, కళాశాలల్లో విద్యార్థి కమిటీలను త్వరలోనే ప్రకటించి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతిఒక్కరి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. ఆచరణ సాధ్యంకాని మోసపూరిత హామీలు, గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. కేవలం ఐదు నెలల్లోనే వారు ప్రజల నుంచి ఛీత్కారాలు పొందుతున్నారన్నారు. కరెంట్ కోతలు, రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేస్తుందని, మహిళలకు ఇస్తానన్న నగదు పథకాలను సైతం పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించమని మొరపెట్టుకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు బదావత్ శాంతి, కౌన్సిలర్లు అంబుల వేణు, బండి నర్సింహారావు, దిండిగల రాజేందర్, ప్రబోద్‌కుమార్, సంకుబాపన అనుదీప్, పడిసిరి శ్రీనివాసరావు, మంతపురి రాజుగౌడ్, రావులపల్లి రాంప్రసాద్, కేవీ రమణ, ఎండీ హుస్సేన్, ప్రసాద్‌గౌడ్ పాల్గొన్నారు.