బోనకల్లు, జూలై 31 : ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ కార్యకర్తలు, నాయకులు ముందుండి పోరాడాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేశ్ అన్నారు. గురువారం బోనకల్లు మండలంలోని రాపల్లె గ్రామంలో ఏనుగు రామకృష్ణ అధ్యక్షతన పార్టీ మండల సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు అధికారులు సైతం పర్యటించి హడావుడి చేస్తారన్నారు. ఇదే సమయంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసి వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు సీపీఐ శ్రేణులు కృషి చేయాలన్నారు. దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని సమస్యలను, ఆర్థికేతర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సాధించాలన్నారు. రేషన్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇతర ప్రజా సమస్యలు, నూతనంగా దరఖాస్తు పెట్టుకునే వారికి అండగా నిలిచి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. గ్రామ గ్రామాన సర్వేలు నిర్వహించి సమస్యలను స్పష్టంగా తెలుసుకుని అధికారులకు వివరించే ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు పార్టీ నుండి చేయాల్సిన సహాయంలో వెనకడుగు వేయొద్దని పేర్కొన్నారు.
పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. విత్తనాలు, యూరియా, డీఏపీ, ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. రాపల్లి, బ్రాహ్మణపల్లి, పాలడుగు గ్రామాలకు వచ్చే వైరా రిజర్వాయర్‌కు సంబంధించిన 26, 28 కాల్వలకు సకాలంలో నీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏనుగు వెంకటేశ్వరరావు, తోట రామాంజనేయులు, బెజవాడ రవిబాబు, ఏనుగు గాంధీ, ఎంఏ రహీం, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, బత్తినేని నీరజ, సీపీఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, మండల కార్యవర్గ సభ్యులు ఆకన పవన్, మరీదు ఈశ్వరమ్మ, పారుపల్లి నరసింహారావు, ఏలూరు రమేశ్, మడుపల్లి వెంకటేశ్వర్లు, కొంగర కృష్ణయ్య, వయంగల పెద్ద రమేశ్, ఏలూరి పూర్ణచందర్రావు, ఏనుగు రవి, బొమ్మినేని కొండలరావు, కొంగర భాస్కర్ రావు, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, తోటపల్లి ఆనందరావు, గుంపుల జయరాజ్ పాల్గొన్నారు.