భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఒక గ్రామం కాదు ఏకంగా ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయి. దీంతో అక్కడ నివసించేవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా మండలాల ప్రజలతో పాటు భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలు విలీన మండలాలు, పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని పోరాడుతున్నారు. పూర్వం ఖమ్మం జిల్లాలో చదువుకున్న పిల్లల భవిష్యత్ రెంటికి చెడ్డరేవడిగా మారింది. వారు తమ సొంత చిరునామా ఎమిటో, స్థానికత ఏమిటో తెలియని విచిత్ర పరిస్థితిలో ఉన్నారు.
సగటు మనిషి బతకడానికి మౌలిక సదుపాయాలు ఉండాలి. కానీ విలీన గ్రామాల పరిధిలో ఒక్క ప్రధాన ఆసుపత్రి లేదు. గ్రామస్తులకు ఏమైనా పెద్ద జబ్బు వస్తే కాకినాడ లేదా రాజమండ్రి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 200 కిలోమీటర్లకు పైగానే ప్రయాణం. ఇలాంటి పరిస్థితుల్లో వారు అక్కడ ఉండడానికి ఏమాత్రం సుముఖత చూపించడం లేదు. స్వగ్రామంలో వందల ఎకరాల పొలం ఉన్నా సాగునీటి వసతి లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నా సొంత బోర్లపైనే ఆధారపడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులకు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలు అమలుచేస్తున్నారని, ఏపీ పరిధిలో తమ గ్రామాలు ఉండడం కారణంగా తమకు ఆ పథకాలు వర్తించడంలేదంటున్నారు. విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిస్తే తమకు పథకాలు వర్తిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దేశం మెచ్చే అద్భుతమైన పథకాలు తెలంగాణ అమలు చేస్తుండడంపై విలీన గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్ ద్వారా జలాల విడుదలను రైతులు వేనోళ్ల కొనియాడుతున్నారు. సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బరాజ్ వంటి సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణ రైతులకు ఉపకరిస్తాయంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కొనియాడుతున్నారు. ఏపీలోని పేరుకే పోలవరం ప్రాజెక్టు అని, అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి అని, ఒకవేళ పూర్తయినా తమ ప్రాంతానికి చుక్కనీరు రాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలవరంతో ముంపు గ్రామాలు జల సమాధి అవుతాయని, లక్షలాది మంది నిర్వాసితులు అవుతారని ఆవేదనను పంచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం విలీన గ్రామాలను పట్టించుకోకపోవడం, తెలంగాణలో తిరిగి
విలీనం చేయక పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
మా గ్రామం ఏపీ పరిధిలో ఉంది. గర్భిణులు ఎవరైనా వైద్యసేవలు పొందాలంటే ఏపీలోని చింతూరు, రాజమండ్రి, కాకినాడలోని ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లాలి. మాకు దూరభారం. ఖర్చులు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలేమీ అక్కడ ఉండవు. ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ రాదు. భద్రాచలం వెళితే ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్లాలి. డబ్బులు వదిలించుకోవాలి. ఏపీ ప్రభుత్వం మాకు ఏమీ చేయడం లేదు. విలీన గ్రామాలన్నింటినీ తెలంగాణలో కలిపితేనే మాకు న్యాయం జరుగుతుంది.
– ఎడ్ల సత్యనారాయణ, వ్యాపారి, గుండాల
నేను పుట్టింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. చదువుకుంది భద్రాచలం, కొత్తగూడెంలో. మా గ్రామం ఆంధ్రప్రదేశ్లో చిట్టచివరి గ్రామం. నేను ఎల్ఎల్బీ ఆంధ్రాలో చేశాను. నా స్థానికత ఏమిటో ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. మా ఊరికి పోస్టు కవర్ వస్తే అడ్రస్ కూడా చెప్పలేని పరిస్థితి. భద్రాచలం అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్లి లెటర్లు తెచ్చుకోవాల్సి వస్తున్నది. పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు కూడా రావడం లేదు. మేము ఏ రాష్ర్టానికి చెందిన వారమో మాకే అర్థం కావడం లేదు. తెలంగాణలో అద్భుతమైన విద్యాలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ మా విద్యార్థులు దూరమవుతున్నారు.
– విద్యగిరి రవితేజ, విద్యార్థి, ఎల్ఎల్బీ
మా ఊర్లో అందరికీ పొలాలు ఉన్నాయి. కానీ సాగునీరు లేదు. పక్కనే గోదావరి ఉంది. కానీ సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నాం. పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ఇన్ని కష్టాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. మావి కొన్ని భూములు భద్రాచలం పరిధిలోనూ ఉన్నాయి. అక్కడికి పోయి సాగుచేసుకోవాల్సి వస్తున్నది. పొలం ఒకచోట మేము ఒకచోట ఉంటున్నాం. ఇదేం విలీనం? ఏపీ ప్రభుత్వం మాకేమీ చేయడం లేదు. తెలంగాణ రైతులకు రైతుబీమా, రైతుబంధు పథకాలు అందుతున్నాయి. మాకు ఎలాంటి పథకాలు వర్తించడం లేదు. – శ్రీనివాసరెడ్డి, రైతు, పురుషోత్తపట్నం, ఆంధ్రప్రదేశ్