ఖమ్మం, ఫిబ్రవరి 6 : కృష్ణా నదిపై హక్కులను కాపాడేందుకు పోరాటం చేయాల్సిందేనని, కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను కాపాడుకోవాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో జిల్లా ప్రతినిధులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో సాగు, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా ‘మా నీళ్లు మాకే..’ అనే నినాదంతో స్వయం పాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకు ఉన్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.. కేంద్రం ఒత్తిళ్లను తట్టుకుంటూ పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్‌లో ప్రాజెక్టుల కట్టలపైకి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ప్రజా మద్దతుతో తిప్పికొడుతున్నామన్నారు.
ప్రజలకు సాగు, తాగునీరు అందక తిరిగి కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి.. కృష్ణా జలాలపై, ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటా, హక్కులను నూటికి నూరుశాతం కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈ నెల 13వ తేదీన చేపట్టే ‘చలో నల్గొండ’కు భారీ జనసమీకరణ చేయాలని ఆదేశించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, ఖమ్మం నగర నాయకులు కూరాకుల వలరాజు, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, నాయకులు వీరూనాయక్, పగడాల నాగరాజు, బొమ్మెర రామ్మూర్తి, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, చెరుకూరి ప్రదీప్, పిన్ని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.