ఖమ్మం అర్బన్, నవంబర్ 4: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించామని, చివరికి ఆర్థిక బాధలు భరించలేకనే కాలేజీల నిరవధిక బంద్ చేస్తున్నామని ఖమ్మం జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు తెలిపారు. ఖమ్మంలోని శ్రీచైతన్య కళాశాలలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీఐటీ కళాశాల కృష్ణ, శ్రీచైతన్య కళాశాల శ్రీధర్, ప్రియదర్శిని కళాశాల నవీన్‌బాబు, బొమ్మ కళాశాల రాజేశ్వరరావు, డేర్ కళాశాల కిరణ్‌లు మాట్లాడుతూ ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీఈడీ వంటి వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బకాయిలు భారీగా పేరుకుపోవడంతో కాలేజీలు నడపలేక గత్యంతరంలేని పరిస్థితుల్లోనే అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు నిరవధిక బంద్ చేస్తున్నట్లు తెలిపారు. రెండోరోజు మంగళవారం సైతం బంద్ సంపూర్ణంగా జరిగిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. విద్యాసంస్థల ఫీజు బకాయిలను మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. దసరాకు, దీపావళికి చెల్లిస్తామంటూ హామీలిచ్చి మొండిచేయి చూపిందని ధ్వజమెత్తారు. బయట వడ్డీకి, బ్యాంకుల్లో రుణాలు తెచ్చి ఇప్పటివరకు కళాశాలలను నడిపామని, ఇక నడిపే స్తోమత లేదని అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. అదే పథకాన్ని నేటి కాంగ్రెస్ సర్కారు అమలు చేయలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వమే 60 శాతం వాటా అందిస్తున్నదని, మిగిలిన వాటాను సైతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆర్థికభారం తలపోటులా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు బకాయిలు ఇచ్చేవరకూ నిరవధిక బంద్ కొనసాగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు.