పెనుబల్లి, అక్టోబర్ 18 : గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన వారిని డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు పంపించి, పోలీసు పహారా నడుమ అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారని ఏరుగట్ల గ్రామస్తులు ఆరోపించారు. పెనుబల్లి మండలం ఏరుగట్ల గ్రామంలో డబుల్ ఇళ్ల కేటాయింపు విషయమై శనివారం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కల్లూరు ఏసీపీ రఘు ఆధ్వర్యంలో సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగం, ఎస్సై వెంకటేశ్‌లు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ శ్రీనివాస్ డబుల్ ఇళ్ల ప్రాంతానికి చేరుకొని.. ప్రస్తుతం నివసిస్తున్న వారు ఇళ్లు ఖాళీ చేయాలని సూచించారు.
అయినా వారు వినకపోవడంతో పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. ప్రస్తుతానికి 40 మందిని పహారా నడుమ కొత్తగా ఇళ్లలోకి పంపించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పంపించారు. గత కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిందని, ఇందుకోసం తమ సొంత స్థలాలను ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చామని తెలిపారు. అలాంటిది తమకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించడం ఏమిటని పలువురు బాధితులు ప్రశ్నించారు. కలెక్టర్ జోక్యం చేసుకొని నిజమైన నిరుపేదలకు ఇళ్లు అందించాలని వారు కోరారు.