మధిర, మార్చి 9 : తమ పంటలు ఎండిపోతుంటే ఆంధ్రా ప్రాంతానికి సాగునీరు తరలించడం ఏంటని మధిర నీటి పారుదల శాఖ ఈఈ రామకృష్ణపై బోనకల్లు మండల రైతులు ఆదివారం కలకోట రెగ్యులేటర్ వద్ద మండిపడ్డారు. బి బి సి కెనాల్ పరిధిలో 24 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఈ పంటలకు వారబంది పద్ధతిలో నీటి పారుదల శాఖ అధికారులు సాగర్ జలాలను సరఫరా చేస్తున్నారు. గత నెల 23న బీబీసీ కెనాల్‌కు సాగర్ జలాలను నిలిపివేశారు. దీంతో ఈ ప్రాంత రైతులు సాగు చేసిన మొక్కజొన్న ఫైర్లను ఎలా కాపాడుకోవాలో తెలియక ఎండిపోతున్న పంటలను చూస్తూ ఆందోళనలో ఉన్నారు.
రైతుల ఒత్తిడి మేరకు ఆదివారం బీబీసీ కెనాల్‌కు నీటి పారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. కొనిజర్ల జీరో కిలోమీటర్లు రెగ్యులేటర్ నుంచి 1,300 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తే 21 కిలోమీటర్ రెగ్యులర్ అయిన బీబీసీకి 700 క్యూసెక్కు నీరు సరఫరా అవుతుంది. కానీ జీరో కిలోమీటర్ రెగ్యులేటర్ వద్ద కేవలం 1,000 క్యూసెక్కు నీటి మాత్రమే విడుదల చేశారు. బీబీసీ కెనాల్‌కు వచ్చే వరకు 500 క్యూసెక్కు నీరు మాత్రమే రావడంతో ఇరిగేషన్ అధికారులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు. బీబీసీ కెనాల్‌కు సరఫరా అవుతున్న సాగర్ జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించేందుకు నీటి పారుదల ఈఈ రామకృష్ణ కలకోట మేజర్, పోలంపల్లి మేజర్ తో పాటు బీబీసీ పరిధిలో ఉన్నటువంటి కాల్వలకు నీరు తగ్గించే ప్రయత్నం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న రైతాంగం తమ ప్రాంతంలో మొక్కజొన్న పంట అంతా ఎండిపోతుందని ఇప్పుడు సాగునీరు అవసరమని ఆయనకు తెలిపారు. ఈ తడి పంటలకు లేకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారని బీబీసీ కెనాల్ పరిధిలో ఉన్నటువంటి కాల్వలన్నింటికీ సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంతంలో రైతులకు సాగునీరు అందించకుండా ఆంధ్ర ప్రాంతానికి తీసుకపోవడం ఏమిటని ప్రశ్నించి రెగ్యులేటర్ల వద్ద తలుపులను తెరిపించారు. అయినప్పటికీ 500 క్యూసెక్కు నీరు బి బి సి పరిధిలోని రైతాంగం సాగు చేసిన పంటలకే సరిపోవని వాపోయారు. బీబీసీ కెనాల్‌కు పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ ఈఈ రామకృష్ణ, డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, ఏఈలు రాజేశ్, ఏడుకొండలు బీబీసీ పరిధిలోని కాల్వలను పరిశీలించారు.