ఖమ్మం సిటీ, జూన్ 20 : ‘పంటలు కొనే దిక్కు లేదు.. మద్దతు ధర ఊసే లేదు.. రైతుబంధు కొందరికే.. రైతు రుణమాఫీ సగం సగం.. రైతుబీమా ప్రీమియం గురించి పట్టింపు లేదు.. కాంగ్రెస్ అడ్డగోలు పాలనలో తెలంగాణ అన్నదాతలు ఆగమాగం అవుతున్నరు’ అని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం(తెలంగాణ భవన్)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ద్రోహి, ఉద్యమకారుల మీదకు తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి ఇక్కడి ప్రజలను, రైతాంగాన్ని మళ్లీ సమైక్య రాష్ట్రంలోకి తీసుకెళ్తున్నాడని ధ్వజమెత్తారు. రెండున్నరేండ్ల క్రితం ఎలక్షన్స్‌కు ముందు కాంగ్రెస్ నాయకులు వరంగల్‌లో సభ ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. రైతుబంధు కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక రూ.12 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించి యావత్ రైతాంగాన్ని మోసం చేశారన్నారు.
కనీసం రైతుబీమాకు ప్రీమియం చెల్లించకుండా మంగళం పాడేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం, మక్కలను కొనుగోలు చేస్తే, కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందని విమర్శించారు. కేంద్రం ఆదేశాల ప్రకారమే పంటలను కొనుగోలు చేస్తామని ప్రకటించడం వారి చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. అదేవిధంగా ఏడు రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లోనూ యూరియా అందక రైతాంగం అష్టకష్టాలను ఎదుర్కొంటున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
బుగ్గపాడు భూములపై విచారణ జరపాలి
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండీ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని బుగ్గపాడు ఫుడ్‌పార్క్ భూములను కాంగ్రెస్ పెద్దలు ఓ కార్పొరేట్ కంపెనీకి కారు చౌకగా కట్టబెట్టడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. ఆయా అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
24న సత్తుపల్లికి కేటీఆర్ రాక..
ఈ నెల 24వ తేదీన ఎస్ఐఆర్(సర్) పట్ల గులాబీ శ్రేణులకు అవగాహన కల్పించే నిమిత్తం సత్తుపల్లి పట్టణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని, ముఖ్యనేతలు, నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బెల్లం వేణుగోపాల్, బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, ఉన్నం బ్రహ్మయ్య, బాషబోయిన వీరన్న, బంక మల్లయ్య, బలుసు మురళీకృష్ణ, యలమద్ది రవి, మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.