ఖమ్మం సిటీ, ఏప్రిల్ 16 : ‘అప్పడు సమయం రాత్రి ఒంటి గంట దాటింది.. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఎలాంటి హంగూఆర్భాటం లేకుండా నేరుగా జిల్లా పెద్దాసుపత్రి ప్రాంగణంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అన్నివార్డుల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రసవాల గది, లేబర్ రూంను పరిశీలించారు. సెకండ్ ఎస్ఎన్సీయూలోని పిల్లలను పరామర్శించారు. అదేక్రమంలో విధుల్లో ఉండాల్సిన గైనకాలజీ వైద్యులు, పీడియాట్రిషన్ వైద్య నిపుణులు, ఇతర సిబ్బంది గురించి ఆరా తీశారు. ఆయన అడుగుతున్న వివరాలకు గైనకాలజీ నిఫుణురాలు డాక్టర్ షహనాజ్ బేగం సమాధానాలు ఇచ్చారు. ప్రసవాలు జరుగుతున్న తీరులో భాగంగా సాధారణం, సెక్షన్ కేసుల గురించి కలెక్టర్ వాకబు చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట దవాఖానకు వచ్చే గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అక్కడి నుంచి బయలుదేరి జనరల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో క్యాజువాలిటీ విభాగంలో విధుల్లో ఉండాల్సిన వైద్యుడు బయటికి వెళ్లారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేస్తున్నారన్న విషయం సిబ్బంది ద్వారా తెలుసుకొని హుటాహుటిన దవాఖానకు వచ్చారు. అప్పుడే కలెక్టర్ ఆయన గురించి ఆరా తీయగా ఉన్నాను ‘సార్’ అంటూ అందరిలో కలిసిపోయారు. అందరూ బాధ్యతగా ఉద్యోగాలు నిర్వహించాలని ఆదేశించి కలెక్టర్ అక్కడ నుంచి వెళ్లారు. కాగా.. శనివారం అర్ధరాత్రి కలెక్టర్ ఎవరూ ఊహించని విధంగా సుమారు గంటపాటు ఆకస్మిక తనిఖీకి రావడంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అవాక్కయ్యారు. కలెక్టర్ వెళ్లిన తర్వాత తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.