భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరి ఉదయం 10.40 గంటలకు కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం విద్యానగర్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ రూ.4 కోట్లతో చేపట్టనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పోస్టాఫీస్ సమీపంలో అమృత్-2.0 నిధులు రూ.124 కోట్లతో కొత్తగూడెం మున్సిపాలిటీకి శాశ్వత మంచినీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ముందస్తుగా గోదావరి వరదలపై కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హెలీక్యాప్టర్‌లో మణుగూరుకు వెళ్లి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును పరామర్శిస్తారు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.