మామిళ్లగూడెం, జనవరి 10: విజబుల్ పోలీసింగ్ ద్వారా నేరాలకు చెక్ పెట్టాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. నేర నిరూపణ కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఖమ్మంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలు ఎంత ముఖ్యమో నేరాలు జరుగకుండా నివారించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. గడిచిన రెండు నెలలుగా వివిధ బందోబస్తు విధుల్లో విరామం లేకుండా బాధ్యతలు నిర్వహించిన జిల్లా పోలీసులందరూ ఇకపై ప్రతిరోజూ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో విజబుల్ పోలీసింగ్‌తోపాటు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపైనా, నేరస్తుల కదలికపైనా నిఘా పెంచాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృ్తతంగా తనిఖీలు నిర్వహించాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అక్రమ రవాణాను నిరోధించే ఉద్దేశంతో ప్రతి చోలా వారానికి ఒకసారి కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. స్మగ్లింగ్‌ను నిరోధించడానికి సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. నేర నిరూపణలో కీలకపాత్ర పోషించే దర్యాప్తు అధికారులు స్పష్టమైన ప్రణాళికతోపాటు మరింత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ పరికరంతో రద్దీ ప్రాంతాలు, రైల్వేస్టేషన్, బస్టాండ్లలో అనుమానిత వ్యక్తుల ఫింగర్ ప్రింట్లను చెక్ చేయాలని అన్నారు. శివారు ప్రాంతాలపై ఎకువ దృష్టి సారించాలని, రాత్రి వేళల్లో ముమ్మర గస్తీ ద్వారా నేరాలను కట్టడి చేయాలని ఆదేశించారు. బైక్ ర్యాష్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్, ఈవ్‌టీజింగ్, అర్ధరాత్రి రోడ్లపై పుట్టిన రోజు వేడుకలు చేస్తూ మద్యం మత్తులో తిరిగే అకాతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. మహిళలు, బాలలపై వేధింపుల కేసులను ఏసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఏడీసీపీలు సుభాశ్ చంద్రబోస్, కుమారస్వామి, ఏసీపీలు ఆంజనేయులు, బస్వారెడ్ధి, వెంకటేశ్, రెహమాన్, రవి, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.