ఖమ్మం, సెప్టెంబర్ 8: ‘దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా..’ అంటూ వాడవాడలా గణపయ్య భక్తిగీతాలు మార్మోగుతున్నాయి. వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చలువ పందిళ్లలో గణనాథులు కొలువుదీరారు. ఖమ్మం నగరంతోపాటు అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో వాడవాడలా శనివారమే విగ్రహాలను ఏర్పాటు చేసిన భక్తులు.. విఘ్ననాథుడి నవరత్రి ఉత్సవాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు.
ఆదిదేవుడైన వినాయకుడిని ప్రజలు తమ ఇళ్లల్లోనూ ప్రతిష్ఠించి ఉండ్రాళ్లు, పాయసం తదితర వంటకాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. పలుచోట్ల పలువురు ప్రముఖులు శని, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మధిర సాయినగర్కాలనీకి చెందిన రఫత్ఖాన్, సాజిదా అనే ముస్లిం దంపతులు జిలుగుమాడులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజల్లో పాల్గొన్నారు.
ఖమ్మం నగరంలోని అనేక ప్రాంతాల్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వినాయక చవితి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం బ్రాహ్మణబజార్ శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన 32 అడుగుల త్రిశుంద్ మట్టి వినాయకుడిని ఎంపీ రవిచంద్ర సందర్శించి తన గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర బొజ్జ గణపయ్యకు గజమాల, పట్టువస్త్రాలు సమర్పించారు.