ములకలపల్లి, అక్టోబర్ 21: మండలంలోని రింగిరెడ్డిపల్లి – గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం రూ.5 కోట్లిచ్చినా దాని నిర్మాణంలో ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండల వాసులు ఆరోపించారు. ఆ వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాస్తారోకోకు దిగారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జూన్లో చేపట్టిన నిర్మాణ పనులు వానల కారణంగా ఆగిపోయాయని చెప్పారు. వానలు తగ్గినప్పటికీ పనులను కొనసాగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పాత బ్రిడ్జి పక్కన అప్రోచ్ రోడ్డుగానీ, సరైన డైవర్షన్ రోడ్డుగానీ నిర్మించకపోవడంతో పరిసర ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో చేస్తున్న వారి వద్దకు ఆర్ఐ భద్రునాయక్ వచ్చి, బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.