అశ్వారావుపేట రూరల్, ఏప్రిల్ 23 : అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అశ్వారావుపేట-రామన్నగూడెం ప్రధాన రహదారిపై బుధవారం ధర్నా నిర్వహించారు. గ్రామంలో 200 కుటుంబాలు ఉండగా.. 60 మందికి ఇళ్లు లేవు. ప్రభుత్వం కేవలం 4 ఇళ్లు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ ఇందిరమ్మ కమిటీ ముందుగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించింది.
ఇందులో సంయుక్తంగా చర్చించి ఆ నాలుగు ఇళ్లు కూడా రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించినట్లు కమిటీ సభ్యులు కోర్స ప్రసాద్, రాచకొండ బంగారం, కె.ఉదయ్‌కుమార్, నారం కుమారి తెలిపారు. మొత్తం 60 మందికి ఇళ్లు మంజూరు చేయండి.. లేదంటే మా గ్రామానికి ఇళ్లే వద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో 20 మంది అర్హులు ఉన్నట్లుగా గుర్తించి.. 4 ఇళ్లు మంజూరు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వరూప, ఆంజనేయులు, రవి, సీతారాముడు, రాజకుమారి, విజయ, సరోజిని, వెంకన్న, రామారావు, సురేశ్, దుర్గ, లక్ష్మి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.