మధిర/ మధిర రూరల్, జనవరి 16: స్థానిక ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను సాక్షాత్తూ అతడి నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు దహనం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో దశబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సేవ చేస్తున్న, గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తున్న, బీఆర్ఎస్కు చెందిన ఓ కుటుంబంపై ఉప ముఖ్యమంత్రి ప్రోద్బలంతో కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఏకంగా డిప్యూటీ సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.
మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన ‘అబ్బూరి’ కుటుంబం ఇక్కడి ప్రజలు సుపరిచితం. ఈ కుటుంబంలోని పలువురు వ్యక్తులు దశాబ్దాలుగా గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతూ వస్తున్నారు. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ, అవసరమైతే సొంత నిధులతో ప్రజలకు సేవలందిస్తూ గ్రామస్తుల ఆదరణను చూరగొన్నారు. గడిచిన పంచాయతీ ఎన్నికల్లో ఇదే కుటుంబానికి చెందిన అబ్బూరి సంధ్య ఈ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్కు చెందిన ఈమె ప్రత్యేక చొరవ తీసుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. సొంత నిధులను కూడా వెచ్చించి గ్రామ కూడలిలో రింగ్ సెంటర్ నిర్మింపజేశారు.
ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఆమె భర్త రామకృష్ణ (మాజీ సర్పంచ్) అనారోగ్యంతో మరణించాడు. అందుకు గుర్తుగా గ్రామస్తుల అభీష్టం మేరకు ఆ రింగ్ సర్కిల్‌కు ‘అబ్బూరి సర్కిల్’ అని నామకరణం చేశారు. అదే పేరుతో అక్కడ ఓ బోర్డును కూడా ఏర్పాటుచేశారు. దీనిని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేపోయారు. అప్పుడే అధికారులకు ఫిర్యాదులు చేశారు. గ్రామస్తుల అభీష్టం మేరకు అబ్బూరి సర్కిల్ పేరుతో బోర్డు ఏర్పాటు చేయడం, అందుకు కలెక్టర్ అనుమతి కూడా తీసుకోవడం వంటి కారణాలో అధికారులు కూడా చర్యలేమీ తీసుకోలేదు. కానీ తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భట్టి విక్రమార్క ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
భట్టి ప్రోద్బలంతో..
అయితే.. ఈ రింగ్ నిర్మాణం వల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో చొరవ తీసుకొని గ్రామాభివృద్ధికి పాటుపడిన బీఆర్ఎస్ సర్పంచ్‌కు ప్రజల్లో మంచి పేరు రావడాన్ని కాంగ్రెస్ నాయకులు తాళలేకపోయారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ప్రోద్బలంతో తాజాగా మరోసారి రంగంలోకి దిగారు. పోలీసు బందోబస్తు మధ్య ‘అబ్బూరి సర్కిల్’ నేమ్ బోర్డులను గురువారం తొలగించారు. దీంతో అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి ప్రోద్బలం వల్లనే బోర్డును తొలగించారని ఆరోపిస్తూ అతడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘భట్టి దౌర్జన్యం నశించాలి.. భట్టి డౌన్‌డౌన్..’ అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తుల ఆందోళనకు బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. భట్టి విక్రమార్క ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి తప్ప చౌకబారు రాజకీయాలు చేయడం తగదని అన్నారు.
అబ్బూరి పేరు తొలగించడం హేయం: లింగాల
ప్రజా నాయకుడు అబ్బూరి పేరును డిప్యూటీ సీఎం భట్టి తొలగింపజేయడం హేయమైన చర్య అని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు అన్నారు. ఆత్కూరు రింగ్ సర్కిల్లో అబ్బూరి పేరుతో ఉన్న నేమ్ బోర్డును భట్టి ప్రోద్బలం, కాంగ్రెస్ నేతల ఒత్తిడితో అధికారులు తొలగించిన అంశంపై ‘నమస్తే తెలంగాణ’తో కమల్‌రాజు మాట్లాడారు. మధిర ఎంట్రన్స్‌లోని ఆత్కూరు క్రాస్‌రోడ్డులో గతంలో అధ్వానంగా ఉండేదని, అబ్బూరి కుటుంబ సభ్యులు వారి సొంత నిధులతో ఆ సర్కిల్‌ను మంచిగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. నాటి కలెక్టర్ సూచన మేరకు రాజ్యాంగబద్ధంగా పంచాయతీలో తీర్మానం చేశాకే, గ్రామస్తుల ఆమోదం పొందాకే ఆ గ్రామ మాజీ సర్పంచ్ అబ్బూరి రామకృష్ణ జ్ఞాపకార్థం ‘అబ్బూరి సర్కిల్’ అని నేమ్ బోర్డు పెట్టినట్లు వివరించారు. ప్రజాదరణ కలిగిన నేతల పేర్లు తుడిచి పైశాచిక ఆనందం పొందడం భట్టివిక్రమార్కకు సరైంది కాదని హితవుచెప్పారు.