ఖమ్మం రూరల్, జూలై 17 : విపత్తులు ఎలాంటి సమయంలో, ఏ రూపంలో వచ్చిన ఆ సమయంలో అప్రమత్తత చాలా ప్రధానమని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో స్థానిక ప్రజలకు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, భారీ వరదలు వంటి విపత్తులు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఆపద సమయంలో ఎలా అప్రమత్తంగా ప్రజలు వ్యవహరించాలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తద్వారా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పి.అనిత, వైస్ చైర్మన్ టి.నవీన్, ఖమ్మం రూరల్ మండలం తాసీల్దార్ వినయేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రియదర్శిని కళాశాల నిర్వాహకులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విపత్తుల సమయంలో అప్రమత్తతే ముఖ్యం : ఈఎంసీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి