ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 9 : భాషా పండితులు తెలుగు, హిందీ, పీఈటీలకు సంబంధించిన ప్రమోషన్లు పొందేందుకు అవసరమైన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆదివారం విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. అప్‌గ్రేడ్ అయిన టీచర్లతోపాటు ఉద్యోగోన్నతికి అర్హులైన ఉపాధ్యాయుల ధ్రువపత్రాలను పరిశీలించారు. ఖమ్మం నగరంలోని నయాబజార్ పాఠశాల కేంద్రంగా పీఈటీలకు, ఇందిరానగర్ స్కూల్లో హిందీ పండిట్లకు, రోటరీనగర్ స్కూల్లో తెలుగు పండిట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఎల్పీ తెలుగులో 220మందికి 219 మంది హాజరుకాగా, ఎల్పీ హిందీలో 212మందికి 206మంది, పీఈటీలో 120మందికి 105మంది హాజరయ్యారు. మొత్తం 530 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాగా ప్రక్రియను డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ చావా శ్రీను పర్యవేక్షించారు. కార్యక్రమంలో సిబ్బంది దేవేందర్, నందగోపాల్, షకీల్, కిరణ్ పాల్గొన్నారు.
అప్‌గ్రేడ్ అయిన స్కూల్స్‌కి సంబంధించిన జాబితా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదివారం విడుదల చేశారు. అప్‌గ్రేడ్ అయిన స్కూల్స్‌లో పనిచేస్తున్న టీచర్లలో అర్హులు కానివారు ఇతర స్కూల్స్‌కు బదిలీ కానున్నారు. అర్హులైన ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవడం ద్వారా పాఠశాల కేటాయించబడుతుంది. దీనిలో భాగంగా ఉద్యోగోన్నతులు పొందే ఉపాధ్యాయులకు సంబంధించిన జాబితాను విద్యాశాఖాధికారులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎల్పీ తెలుగు, ఎల్పీ హిందీ, పీఈటీలు, పీడీలకు సంబంధించిన జాబితా ఉద్యోగోన్నతులతోపాటు బదిలీలకు సంబంధించిన సీనియార్టీ జాబితాను వెబ్సైట్లో ఉంచారు.
ఉద్యోగోన్నతుల ప్రక్రియకు అర్హులై కూడా సుమారు 22మంది ఉపాధ్యాయులు హాజరుకాలేదు. దీనిపై విద్యాశాఖ వద్ద వివరాల ఆధారంగా సంబంధిత ఉపాధ్యాయులను గుర్తిస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారికి ఉద్యోగోన్నతులు కల్పించి, హాజరుకాని వారిని యధాస్థానంలో కొనసాగించనున్నారు. ఉద్యోగోన్నతులకు సంబంధించిన జాబితాపై సోమవారం, మంగళవారాల్లో అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాల అనంతరం జాబితాను వెలువరించి ఆప్షన్ల ద్వారా ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ పర్యవేక్షిస్తున్నారు.