భద్రాద్రి జిల్లాలో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. స్థానికంగానే ఉద్యానవన పంటలు సాగవుతున్నప్పటికీ ధరలు మాత్రం ప్రియమవుతున్నాయి. కార్తీకమాసం కావడంతో కూరగాయలు, ఆకుకూరలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఇదే సమయంలో మాంసాహార ధరలు గణనీయంగా తగ్గాయి. ఎక్కువ శాతం మంది భక్తులు వివిధ దేవుళ్ల మాలలు ధరించడం, వారు పూర్తిగా శాఖాహారానికే పరిమితం కావడం, వారి కుటుంబాలు కూడా దాదాపు 30 నుంచి 40 రోజులపాటు శాఖాహారమే తీసుకోవాల్సి ఉండడం వంటి కారణాలతో కాయగూరలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఒక్కసారిగా ధరల పెరుగుదలకు ఇదే కారణంగా కన్పిస్తోంది.
-భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో నీటి వనరులున్న పలు ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరల సాగు గణనీయంగా జరుగుతోంది. అయితే, జిల్లా ప్రజల వినియోగానికి అవి సరిపోవడం లేదు. అనుకూల వాతావరణం లేక ఈ ప్రాంతంలో సాగుకాని మరికొన్ని రకాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాల్లో తుపాన్ల కారణంగా దిగుబడి తగ్గిందని, అందువల్లనే ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, దీనిని అదునుగా భావించిన మరికొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారు. అయితే, కాంగ్రెస్ సర్కారులో అధికారులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు కూడా ఈ ధరల నియంత్రణపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అవన్నీ కలిసి ప్రజల నెత్తిన ధరల భారాన్ని మోపుతున్నారు.
ధరల పెరుగుదల కారణంగా మాల ధరించిన వారు, వారి కుటుంబాల వారు తప్ప మిగిలిన వారిలో వినియోగం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. నిత్యం కిటకిటలాడే మార్కెట్లు కొన్నిచోట్ల వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు మాంసం తినాలంటే.. ‘మన స్థాయి కాదులే..’ అని సామాన్యులు అనుకునే విధంగా నాన్ వెజ్ ధరలు ఉండేవి. కానీ.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.
ముఖ్యంగా చికెన్ ధరలు గణనీయంగా పడిపోయాయి. కార్తీక మాసంలో నాన్ వెజ్ వినియోగించేవారు చికెన్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం చికెన్ ధర తగ్గి కేజీ రూ.180కి దిగి రాగా.. కేజీ చిక్కుడు కాయల ధర రూ.100కు మించి పలుకుతోంది. టమాటాను కొందరు వ్యాపారులు.. కేజీ రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. రూ.10కి విక్రయించే.. చిన్న సొరకాయను రూ.50 చెబుతున్నారు. ఆకుకూరల ధరలు ఇంకా ప్రియంగా కన్పిస్తున్నాయి. రూ.20కి మూడు కట్టలు మాత్రమే ఇస్తున్నారు. రూ.20కి మూడే నిమ్మకాయలు వస్తున్నాయి. ఉల్లిపాయలు కూడా కేజీ రూ.60 చెబుతుండడం గమనార్హం.
కూరగాయల ధరలు ఇంతలా పెరగడం ఎప్పుడూ చూడలేదు. ఈ ధరలు చూస్తే కొనే పరిస్థితి, తినే పరిస్థితి కన్పించడం లేదు. టమాటా, మిర్చి ధరలు భారీగానే పెరిగాయి. చిక్కుడు కాయలు రూ.100 దాటి ఉంటే మాలాంటి సామాన్యులు ఎలా కొనగలరు. దానికంటే అర కేజీ చికెన్ కొనుక్కోవడం మేలనిపిస్తోంది. మార్కెట్లోని ధరల పట్టికలో రేటు కంటే.. వ్యాపారులు పెంచి చెబుతున్నారు.
-కనకరాజు, బాబూక్యాంపు, కొత్తగూడెం
కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ధరల నియంత్రణ చేసే అధికారులు ఎక్కడా కన్పించడం లేదు. వారు ఆఫీసులో కూర్చోకుండా ఒక్కసారి మార్కెట్లోకి వచ్చి చూస్తే ధరలు ఎంతలా పెరిగాయో తెలుస్తుంది. ఒక సొరకాయ తీసుకుంటే రూ.50 చెబుతున్నారు. అది ఒక్కపూట కూడా రావడం లేదు. రెండో పూటకు మరో కూర వండాల్సి వస్తోంది. దానికి మరో రూ.100 వరకూ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-పీ.రాణి, బూడిదగడ్డ, కొత్తగూడెం