ఖమ్మం రూరల్, నవంబర్ 12 : సాధారణంగా చలికాలం వచ్చిందంటే దాదాపు అన్నిరకాల కూరగాయల ధరలు అదుపులో ఉంటాయి. ఏ కాలంలో తగ్గని చిక్కుడుకాయ ధరలు చలికాలంలో మాత్రం కచ్చితంగా తగ్గుతాయి.. కానీ, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చిక్కుడుకాయలు కిలో ధర రూ.130లకు చేరి చుక్కలు చూపెడుతుంటే, మిగిలిన కూరగాయల ధరలు కిలో ఒక్కంటికి దాదాపు రూ.70కు చేరాయి. ఖమ్మం జిల్లాలో కూరగాయల ఉత్పత్తి పూర్తిగా తగ్గడంతో వ్యాపారులు ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నారు. ధరలు పెరిగినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.
చలికాలం వచ్చిందంటే ఇరుగు పొరుగు వారు ఒకరికొకరు కూరగాయలను ఇచ్చిపుచ్చుకునేవారు. కానీ, ప్రస్తుతం పైసలిచ్చి కొనుక్కుందామన్నా కొన్నిరకాల కూరగాయలు దొరకని పరిస్థితి దాపురించింది. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో వినియోగదారులపై పెను ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం కూరగాయల సాగుకు రాయితీ ఆశించిన మేర ఇవ్వకపోవడంతో సాగు తగ్గిందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు కొద్దోగొప్పో విస్తీర్ణంలో సాగు జరిగినప్పటికీ అధిక వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు ఒకప్పుడు ఖమ్మం జిల్లా పెట్టింది పేరు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా అనేక కారణాల వల్ల జిల్లాలో కూరగాయలు, ఆకుకూరల సాగు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఖమ్మం నగర శివారు మండలాలైన రఘునాథపాలెం, ఖమ్మంరూరల్, చింతకాని, కూసుమంచి మండలాల్లోని ఆయా గ్రామాల్లో కొద్దిమంది రైతులు మాత్రమే కూరగాయల సాగు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రతి రకం కూరగాయలను స్థానిక వ్యాపారులు ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రవాణా భారం ఇతర కారణాల వల్ల అమాంతంగా కూరగాయల ధరల పెరుగుదలకు కారణమవుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. కార్తీక మాసం తరువాత ధరల్లో కొంత తేడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఖమ్మం నగరంలోని రైతుబజార్లో బుధవారం నమోదైన ధరల వివరాలను పరిశీలిస్తే చిక్కుడుకాయ కిలో రూ.130, వంకాయ రూ.70, గుత్తి వంకాయ రూ.76, బెండకాయ రూ.76, పచ్చిమిర్చి రూ.50, టమాట రూ.36, కాకరకాయ రూ.60, బోడకాకర 120, బీరకాయ రూ.68, దొండకాయ రూ.70, దోసకాయ రూ.60, బుడం దోసకాయ రూ.76, గోరుచిక్కుడు రూ.76, క్యారెట్ రూ.70, బీట్రూట్ రూ.56, క్యాప్సికం రూ.56, బీన్స్ రూ.76 వీటితోపాటు ఆకుకూరలు కట్ట 20 నుంచి రూ.30 వరకు పలికింది.
ఊర్లో కూరగాయలు కొనాలంటే ధరలు మండిపోతున్నాయి. ఖమ్మం నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లో కొందామని వచ్చాను. హోల్‌సేల్‌లోనే ఇంత ధరలు ఉన్నాయంటే ఇక గ్రామాల్లో రెండింతలు ఉంటాయి. చిన్నచిన్న కొట్ల వద్ద కిలో రూ.100 వరకు పలుకుతున్నాయి. మూడు వందలు పెట్టి కూరగాయలు కొంటే కనీసం మూడు రోజులకు కూడా సరిపడా రాలేదు. లోకల్‌గా కూరగాయల సాగు చేపడితే ఇంత ధరలు పలికేవి కావు. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ధరలు తగ్గే విధంగా చూడాలి. లేకపోతే రోజు కూలి పని చేసిన డబ్బులు కూరగాయలకే సరిపోతాయి.
-దుర్గారావు, గోళ్లపాడు, ఖమ్మం రూరల్