ఖమ్మం ఫిబ్రవరి 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; నాడు మురికికూపంతో కునారిల్లిన ఖమ్మం తెలంగాణకే రోల్‌మాడల్‌గా నిలిచింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక ప్రణాళిక, పట్టుదలతో స్తంభాద్రి నగరంగా తీర్చిదిద్దారు. చరిత్ర పుటల్లో నిలిచేలా ప్రగతి తిలకం దిద్దారు. నగరం నలుచెరగులా అభివృద్ధి ముద్ర వేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.వేల కోట్ల నిధులు మంజూరు చేయించి ఖమ్మం నగర రూపురేఖలు మార్చి వేశారు.
ప్రగతి నిరోధకులు ఎన్ని అడ్డంకులు సృష్టించింనా లక్ష్యం విస్మరించకుండా అభివృద్ధి బీజం నాటారు. ఇప్పుడా బీజం కాస్త శాఖోపశాఖలుగా విస్తరించి నగరం నలుచెరగులా ప్రగతి దారులు వేసింది. రహదారుల మధ్యలో పచ్చని చెట్లు, ఎల్ఈడీ దీప కాంతులతో నగరం మెరిసి మురిసిపోతున్నది. అసెంబ్లీ సమావేశల్లోనూ మంత్రి కేటీఆర్ ఖమ్మం అభివృద్ధిని ప్రస్తావించారు. నగరంలో నూతనంగా నిర్మించిన వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ ఫొటోలను ప్రదర్శించారు. గజ్వేల్ మార్కెట్ తర్వాత ఇదే అతిపెద్ద మార్కెట్ అని కొనియాడారు. దీంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం నగరం దేశంలోని ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. తద్వారా అన్ని రంగాల్లో పురోగతి సాధించడంతోపాటు ఉపాధి కేంద్రంగా మారింది.
ఖమ్మం అభివృద్ధి నమూనా చూసి రండి..
సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి విషయమై చర్చకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మీరంతా ఖమ్మం వెళ్లి అక్కడ జరిగిన అభివృద్ధి నమూనాను పరిశీలించి రండి అని చెప్పారు. దీంతో వారు ఖమ్మం నగరానికి వచ్చి రెండురోజులపాటు ఇక్కడ జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి అభివృద్ధి తీరుతెన్నులు తెలుసుకున్నారు. తమ జిల్లాలోనూ ఇక్కడి ప్రణాళికను అమలు చేస్తామని చెప్పి వెళ్లారు. అంతేకాదు, రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తన్నీరు హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఇక్కడికి వచ్చిన సందర్భంలో నగరాభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. ప్రగతికి బాటలు వేస్తున్న మంత్రి అజయ్ కృషిని అభినందించారు.
నాడు.. నేడు ఎంతో తేడా
నాడు : గతంలో ఖమ్మం నగరంలో ఎక్కడికెళ్లినా మురికికూపాన్ని తలపించేది. పందుల గుంపులు.. కుక్కల స్వైరవిహారం.. దారుల వెంట దుర్వాసన.. గుంతలరోడ్లు.. వెలగని వీధిలైట్లు.. వీధివీధినా చెత్తకుప్పలే దర్శనమిచ్చేవి. కనీస వసతులు కరువు. పట్టించుకునేనాథులే లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా నగర తలరాతను మార్చలేకపోయారు. కానిప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆశాదీపంలా మారింది. బోసిపోయిన నగరానికి కాంతిపుంజాన్ని ప్రసాదించింది. మంత్రి పువ్వాడ ప్రత్యేక చొరవతో నిధులు తీసుకొచ్చి నగర ప్రగతి బాటలు వేశారు. ఖమ్మం రూపురేఖలు మార్చేశారు. మున్సిపాలిటీగా ఉన్న ఖమ్మాన్ని.. కార్పొరేషన్‌గా తీర్చిదిద్దారు. అభివృద్ధి జెండాతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నగర కీర్తిని ఎల్లెడలా వ్యాప్తి చేశారు.
నేడు : ఖమ్మం నగరం మెరిసి మురిసిపోతున్నది. సుందర.. నగరంగా వర్ధిల్లుతున్నది. అద్దంలా మెరిసే రోడ్లు.. వాటి మధ్య అందమైన మొక్కలు.. ఎల్ఈడీ కాంతుల వెలుగులు.. కార్పొరేట్ షాపింగ్ మాల్స్.. వివిధ ప్రధాన కూడళ్ల మధ్య ఆహ్లాదాన్ని పంచుతున్న ఫౌంటేన్లు నభూతో నభవిష్యత్ అన్నట్లుగా విరాజిల్లుతున్నది. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే.. మరో కారణం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.
ఎల్ఈడీ కాంతులు
ఖమ్మం నగరంలో రాత్రివేళ అడుగుపెడితే చాలు ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుకుతున్నది. నిశీధిలోనూ పగటిపూటలా కనిపిస్తున్నది. నగరానికి కొత్త అందాలను తీసుకురావడంతోపాటు విద్యుత్ భారాన్ని తగ్గించుకునేందుకు ఖమ్మం నగరపాలక సంస్థ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అతి తక్కువ ఖర్చుతో వెన్నెలలాంటి వెలుగులను నగర ప్రజలకు అందించేందుకు ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.
సుందరీకరణకు ప్రాధాన్యం..
ఖమ్మంలో నిర్మించిన ఫౌంటేన్లు, పార్కులు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. లకారం ట్యాంక్‌బండ్, పార్కు, వివిధ స్ఫూర్తినిచ్చే నాయకుల విగ్రహాలు పెట్టారు. పండుగలు, వీకెండ్స్‌లో నగరవాసులు లకారం ట్యాంకుబండ్ వద్దకు వచ్చి సందడి చేస్తుంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సాయంత్రం వేళల్లో సేద తీరుతుంటారు. ఇల్లెందు క్రాస్ రోడ్డు, కాల్వొడ్డు, మమతరోడ్లోని లకారం పార్క్ వద్ద నిర్మించిన ఫౌంటెన్లు రాత్రి వేళల్లో మెరిసిపోతున్నాయి. రోటరీనగర్, వ్యవసాయ మార్కెట్, చర్చికాంపౌండ్, జహీర్‌పుర తదితర ప్రాంతాల్లో పార్కులు అందుబాటులో ఉండటంతో ఆయా ప్రాంతాలవారు సేదతీరు తుంటారు.
అభివృద్ధికి నిధుల వరద
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మం అభివృద్ధి గుమ్మంగా మారింది. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్, గ్రీనరీలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. నగరం నడిబొడ్డున నాలుగెకరాల విస్తీర్ణంలో రూ.22 కోట్లతో నిర్మించిన నూతన కార్పొరేషన్ భవనం ప్రత్యేకత సంతరించుకున్నది. ఖమ్మం పాత కార్పొరేషన్లో కార్యాలయంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. రూ.4 కోట్లతో లకారం ట్యాంకుబండ్‌ను సుందరీకరించారు. రూ.93.70 లక్షలతో జడ్పీసెంటర్ నుంచి ఐటీ హబ్ వరకు పుట్‌పాత్ జోన్‌ను ఏర్పాటు చేశారు. రూ.8.75 కోట్లతో లకారం వద్ద తీగల వంతెనను (కేబుల్ బ్రిడ్జి), మరో రూ.2 లక్షలతో మ్యూజికల్ ఫౌంటేన్‌ను నిర్మించారు.
పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ అమృత పథకం కింద మంజూరైన రూ.279 కోట్లతో ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తున్నారు. 34 ప్రదేశాల్లో పబ్లిక్ టాయ్లెట్లను నిర్మించారు. దానవాయిగూడెంలో రూ.5.48 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధీకరణ కర్మాగారం ఏర్పాటు చేశారు. పారిశుధ్య నిర్వహణకు రూ.కోటీ 73 లక్షలతో 10 ట్రాక్టర్లు, 15 ఆటోలను కొనుగోలు చేశారు. నగరంలో రూ.9 కోట్లతో 25,520 ఎల్ఈడీ వీధిదీపాలు వెలిగిపోతున్నాయి. రూ.35 కోట్లతో 6.5 కిలోమీటర్ల బీటీరోడ్డు 9.6 కిలో మీటర్ల సీసీ రోడ్డు నిర్మించారు. అన్ని డివిజన్ల అభివృద్ధికి రూ.7.52 కోట్లను విడుదల చేశారు.
నలుచెరుగులా.. ప్రగతి మెరువగా..
నగరానికి తూర్పున లకారం ట్యాంకు బండ్.. ఉత్తరాన కొత్త బస్టాండ్, దక్షణాన రైల్వే ఓవర్ బ్రిడ్జి, పడమరాన వైకుంఠధామం.. ఇలా ఎన్నో నిర్మాణాలు ప్రగతి చిహ్నాలై మెరుస్తున్నాయి. వైరారోడ్, ఇల్లెందు రోడ్ల విస్తరణతో వ్యాపార సముదాయాలు పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చింది. కాల్వొడ్డు రహదారుల నిర్మాణం, బైపాస్ రోడ్డు, నగరంలో అంతర్గత రోడ్లతో కొత్తరూపును సంతరించుకున్నది. ఇల్లెందు క్రాస్ రోడ్డులో నిర్మించిన ఐటీ హబ్ నగరానికే తలమానికంగా నిలుస్తున్నది.