
ఖమ్మం : వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఖమ్మంజిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి తమ ఇష్ట దైవాలను దర్శించుకుని పూజలు చేశారు. ప్రధానంగా మహిళా భక్తులు వరలక్ష్మీ వ్రతాలు, సామూహిక కుంకుమ అర్చనలు, చేసి పరాశక్తి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న “మనగుడి” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని శాంతినగర్ శ్రీకోదండ సీతారామాలయంలో అత్యంత వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. అమ్మవారికి సామూహిక కుంకుమ అర్చనలునిర్వహించారు.

వేద పండితులు మరింగంటి కృష్ణమాచార్యులు జగజ్జనని మహిమను, వరలక్ష్మీ వ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాసులు, కె. రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నగరంలోని ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీస్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, కమాన్బజార్, మామిళ్లగూడెం వెంకటేశ్వరస్వామి ఆలయాలు, ఎన్ఎస్పి రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు విశేష పూజలు చేశారు.