ఖమ్మం రూరల్, ఏప్రిల్ 14 : దశాబ్దాలుగా వృక్ష సంపదను పెంపొందించేందుకు కోట్లాది మొక్కలు నాటి యావత్ సమాజానికి మార్గదర్శకమైన వనజీవి రామయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని వనజీవి రామయ్య ఇంటికి వచ్చిన నామ, పువ్వాడ తొలుత రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రామయ్య సతీమణి జానకమ్మను కలిసి మనోధైర్యం చెప్పారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఒక్కటి కాదు రెండు కాదు ఐదు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసి కోట్లాది మొక్కలు నాటిన మహోన్నతమైన వ్యక్తి వనజీవి రామయ్య అన్నారు. తన ఆశ, శ్వాస వృక్ష సంపదగానే పెట్టుకుని తుది శ్వాస వరకు హరితవనాల పెంపు కోసం కృషి చేశాడని కొనియాడారు. రామయ్య లాంటి వ్యక్తి మన జిల్లా వాసి కావడం మనకెంతో గర్వకారణం అన్నారు. రామయ్య ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా మనమందరం విరివిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజ్, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయకుమార్, రూరల్ మండలం మాజీ జడ్పిటిసి ఎండపల్లి వరప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Khammam Rural : వనజీవి రామయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం : మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ