భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రపంచం ఉన్నంత వరకు ఆదికవి వాల్మీకి మహర్షి రాసిన రామాయణం, ఆయన చరిత్ర ఉంటుందని, మహోన్నత వ్యక్తి వాల్మీకి స్ఫూర్తితోనే అనేక మంది కవులు, రచయితలుగా మారారని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో వాల్మీకి జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు.
వాల్మీకి మహర్షి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని రచించింది బోయ కులానికి చెందిన వాల్మీకి అని, ఆయన సాహిత్యం, ఇతిహాసాల్లోని సారాంశాలను ఈ తరం పిల్లలకు అర్థమయ్యే విధంగా తెలియజేసే బాధ్యత మరందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అబివృద్ధి అధికారి ఇందిర, కలెక్టరేట్ ఏవో రమాదేవి, బీసీ సంఘం నాయకులు మురికి వెంకన్న, బోగా నందకిషోర్, ఉలవల రాములు, గట్టేశం తదితరులు పాల్గొన్నారు