ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మార్చి 13: తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో గురువారం చీకటి రోజుగా మిగులుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. నిండు అసెంబ్లీలో అధికార పార్టీ పట్టపగలే ప్రజాస్వామ్యం గొంతు నొకిందన్నారు.
ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం, ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తే సస్పెండ్ చేయడం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం విచారకరమని అన్నారు. శాసన సభ్యుడి వివరణ కూడా అడగకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రజల పక్షాన రాజీలేని పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభకు దూరం చేయాలన్న ఉద్దేశంతోనే అధికార పక్షం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిందిగా శాసనసభాపతి ప్రసాద్‌కుమార్‌ను రవిచంద్ర కోరారు.