పాల్వంచ, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండేళ్ల పాలనను కేవలం కాలక్షేపంతోనే వెళ్లిదీసింది తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజల కనబడుతోందని గుర్తుచేశారు. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పని ఏ ఒక్కటీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులంతా కలిసి రాష్ర్టాన్ని దోచుకుతింటున్నారని ఆరోపించారు.
పాల్వంచలోని 37, 38, 39 డివిజన్లలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవ, కాపు సీతాలక్ష్మీలతో కలిసి ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ భూములనుకబ్జాలకు, బొగ్గు కుంభకోణాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే.. తమ నాయకులపై కక్షసాధింపు చర్యలు దిగుతున్నారని మండిపడ్డారు. వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, అభ్యర్థులు బత్తుల మధుచంద్, స్వప్న కుమారి, మల్లెల రవిచంద్ర, తెలంగాణ సురేశ్, బేతంశెట్టి విజయ్, జూపల్లి దుర్గాప్రసాద్, బట్టు మంజుల పాల్గొన్నారు.