ఖమ్మం, ఏప్రిల్ 1: పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్‌రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్‌రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలోని కేంద్రమంత్రి చాంబర్లో ఎంపీలు ఆయనతో సమావేశమై తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపాన ప్రతిపాదిత విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిందిగా మంత్రిని కోరారు. సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు నవభారత్, ఐటీసీ, మణుగూరు హెవీ వాటర్‌ప్లాంట్ సహా పలు పరిశ్రమలు నెలకొన్నాయని, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చిపోయే భక్తులకు ఇకడ ఏర్పాటు చేసే విమానాశ్రయం సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు.
హెచ్‌సీయూ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీకి చెందిన 400ఎకరాల భూమిని వేలం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ భూముల్లో చెరువులతోపాటు అరుదైన వృక్ష సంపద, జింకలు, నెమళ్లు, పక్షులు ఉన్నాయని వివరించారు.