ఖమ్మం, ఏప్రిల్ 22: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూ వాడా ఎల్కతుర్తి బాట పట్టాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం ఖమ్మం నగరంలోని బుర్హాన్పురం 51వ డివిజన్లో ముఖ్య నాయకులతో మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాలను ఆదుకున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ప్రజలు విసిగిపోయారని, మళ్లీ కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సభకు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు వీరభద్రం, 51వ డివిజన్ కార్పొరేటర్ రమాదేవి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.