ఇల్లెందు, జూలై 11: ఇల్లెందు పరిసర ప్రాంత రైతులకూ యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం కర్షకులు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకే రైతులు వచ్చి పడికాపులు కాస్తుండడం యూరియా కొరతకు అద్దం పడుతోంది.
అయితే, గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కోసం ఇంత కష్టం పడలేదని, ఆ ప్రభుత్వం కొరత రానీయలేదని అక్కడికొచ్చిన పలువురు రైతులు చర్చించుకున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే యూరియా కోసం మళ్లీ క్యూలు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 5 గంటలకు వస్తే మధ్యాహ్నం 12 గంటల యూరియా బస్తా లభించిందని ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన రైతు భూక్యా సురేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీని కోసం మూడు రోజులపాటు వ్యవసాయ పనులు మానుకొని తిరగాల్సి వచ్చిందంటూ ప్రభుత్వంపై మండిపడ్డాడు.