బోనకల్లు, సెప్టెంబర్ 20 : యూరియా కోసం వచ్చిన రైతులకు పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేసిన పరిస్థితి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని రావినూతల సహకార సంఘానికి యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రావినూతల, ఆలపాడు గ్రామాలకు చెందిన రైతులు భారిగా చేరుకున్నారు. సహకార సంఘానికి కేవలం 323 కట్టలు యూరియా మాత్రమే వచ్చింది. కానీ వారం రోజుల క్రితం రైతులకు సంబంధించిన ఆధార్ కార్డులను సేకరించారు. వీటితో పాటు మరో 400 మంది రైతులు యూరియా కోసం సహకార సంఘం వద్దకు రావడంతో నేను ముందుంటే నేను ముందు అంటూ తోపులాట మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఆధార్ కార్డులు ఆధారంగా కాకుండా సాగు చేసిన భూమి ఆధారంగా యూరియాను పంపిణీ చేయాలని ఆందోళన దిగారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పొదిలి వెంకన్న, ఏఓ పసులూరి వినయ్ కుమార్ తమ సిబ్బందితో వచ్చి రైతులను సమదాయించారు. క్రమ పద్ధతిలో రైతులకు యూరియాను అందించడం జరుగుతుందని తెలిపి వారిని శాంతింపజేశారు. రైతుకు స్టాక్ ఉన్న యూరియాకు కూపన్స్ ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఒక కుటుంబంలో ఐదు ఆధార్ కార్డులు ఉంటున్నాయని, వారందరికీ ఆధార్ ప్రకారం రెండు కట్టలు ఇస్తే మిగిలిన రైతులకు యూరియా దొరకడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ యూరియా ఎప్పుడు వస్తుందో తెలియదని అప్పటివరకు పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు సరిపడి యూరియాను ప్రభుత్వం సరఫరా చేయాలని అధికారులను వేడుకున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా కోసం వచ్చిన రైతులకు కూపన్స్ ఇచ్చి యూరియాను పంపిణీ చేశారు.
Bonakal : రావినూతలలో పోలీస్ బందోబస్తు నడుమ యూరియా పంపిణీ