భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19, (నమస్తేతెలంగాణ): కులమతాలకు అతీతంగా అర్హులందరికీ ఆర్థికసాయం అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని, మైనార్టీలకు ఆర్థికసాయం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. శనివారం కొత్తగూడెంలోని ఉర్దూఘర్‌లో ఆయన మైనార్టీ లబ్ధిదారులకు రూ.లక్ష సాయం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ.. సంపదను సృష్టించడం ఆ సంపదను నిరుపేదలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జిల్లాలో 140 మంది ముస్లింలకు రూ.లక్ష చొప్పున సాయం అందించడమే కాకుండా వారి ఆర్థికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రెండో విడతలో నియోజకవర్గానికి 120 చొప్పున అందిస్తామన్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానంగా ఆర్థికసాయం అందిస్తుందన్నారు. కలెక్టర్ ప్రియాంక ఆల మాట్లాడుతూ.. మరో 15 రోజుల్లో నియోజకవర్గానికి 120 మందిని ఎంపిక చేసి సాయం అందజేస్తామన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, ఉర్దూఘర్ చైర్మన్ అన్వర్‌పాషా, వైస్ చైర్మన్ దామోదర్, ఆర్డీవో శిరీష, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీఓలు, ఎంపీపీలు సోనా, శాంతి పాల్గొన్నారు.