అసలే మారుమూల జిల్లా. మైదాన ప్రాంతం నుంచి విసిరేసినట్లుండే గిరిజన ప్రాంతం. ఇక్కడ నివసించే వారంతా అత్యంత నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. వారి ఆరోగ్య పరిరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఏజెన్సీలోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట, బూర్గంపహాడ్, పాల్వంచ ఆసుపత్రులు అప్‌గ్రేడ్ అయ్యాయి. శాసన సభ్యులు రేగా కాంతారావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే ఫండ్స్‌ను ఆసుపత్రుల అభివృద్ధికి కేటాయించారు. జిల్లావైద్యారోగ్యశాఖ ఆయా ఆసుపత్రుల్లో అధునాతన వైద్యపరికరాలు సమకూర్చింది. జిల్లావ్యాప్తంగా కొత్తగా 60 మంది వైద్యులను నియమించింది. వీరిలో ఎనిమిది మంది గైనకాలజిస్టులు. ప్రభుత్వ వైద్యం మరింత చేరువవుతుండడంతో జిల్లాప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కార్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ఏజెన్సీవాసులకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువైంది. సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. మారమూల ప్రాంతాల్లోని పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తూ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట, బూర్గంపహాడ్, పాల్వంచ ఆసుపత్రులు అప్‌గ్రేడ్ అయ్యాయి.
నిధులకు ఎమ్మెల్యేల సహకారం..
కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ ప్రారంభం కావడంతోపాటు పెద్దాసుపత్రి మరింత బలోపేతమైంది. ఆసుపత్రిలో మరిన్ని విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఎమ్మెల్యేలు వారి పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని ఆసుపత్రులను పట్టుబట్టి అప్‌గ్రేడ్ చేయించుకున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇటీవల సీఎం కేసీఆర్‌తో చర్చించి పాల్వంచ 50 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి అప్‌గ్రేడ్ చేయించారు. ప్రస్తుతం ఇల్లెందు ప్రభుత్వాసుపత్రి అన్ని హంగులు, వసతులతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మణుగూరు వంద పకడల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ అయింది. ఆసుపత్రిలో గైనిక్‌తో పాటు పలు విభాగాలకు ప్రత్యేక వైద్యనిపుణులు నియమితులయ్యారు. వైద్యులు ఇప్పటివరకు ఆసుపత్రిలో 500 సర్జరీలు పూర్తి చేశారు.
ఎమ్మెల్యేల నిధులు కేటాయింపు..
ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కేటాయించిన అభివృద్ధి నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు ఆసుపత్రి అభివృద్ధికి రూ.75 లక్షలు, బూర్గంపహాడ్ ఆసుపత్రికి రూ.2.70 కోట్లు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ ఇల్లెందు ఆసుపత్రికి రూ.35 లక్షలు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట ఆసుపత్రికి రూ.35 లక్షలు నిధులు కేటాయించారు.
కొత్తగా 60 మంది వైద్యుల నియామకం..
మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జిల్లావైద్యారోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధవహిస్తున్నది. డీసీహెచ్ఎస్ రవి చొరవ తీసుకుని ఏజెన్సీలో వైద్యసేవలు అందించేందుకు 60 మంది వైద్యులను నియమించారు. వీరిలో ఎనిమిది గైనిక్ వైద్యులు. గత కలెక్టర్ అనుదీప్ చొరవ తీసుకుని వారికి నెలకు రూ.2 లక్ష వేతనం అందేలా చర్యలు తీసుకున్నారు. మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో వైద్యులు తొలిసారిగా మోకాలి ఆపరేషన్ చేశారు.
భద్రాచలం ఆసుపత్రికి ఆరోగ్యశ్రీలో గుర్తింపు..
మన్యం ప్రజలకు వైద్యపరంగా పెద్దదిక్కు భద్రాచలం ప్రభుత్వాసుపత్రి. ఆసుపత్రి పరిధిలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ విభాగంలో ఇప్పటికే ఆసుపత్రి రాష్ట్రస్థాయి అవార్డును సైతం దక్కించుకున్నది. వైద్యులు నెలకు సగటున 250 మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో 125 కేసులు, నవంబర్ 227, డిసెంబర్ 235, జనవరి 215, ఫిబ్రవరి 264, మార్చి 423, ఏప్రిల్ 444, మే 410, జూన్ 371, జూలై 228 కేసులు చూశారు. ఆగస్టులో ఇప్పటివరకు 72 మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించారు.
త్వరలో చర్ల, జూలూరుపాడు ఆసుపత్రులు అప్‌గ్రేడ్..
మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యారోగ్యశాఖ జిల్లాలోని జూలూరుపాడు, చర్ల పీహెచ్సీలనూ అప్‌గ్రేడ్ చేయనున్నది. చర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్ర అభివృద్ధికి ఇప్పటికే రూ.1.40 లక్షల నిధులు కేటాయించింది. ఆసుపత్రికి మెటర్నరీ వార్డు మంజూరు చేసింది. అదనంగా ఇద్దరు వైద్యనిపుణులను నియమించింది. త్వరలో జూలూరుపాడు పీహెచ్సీకీ వైద్యనిపుణులను నియమించనున్నది. శస్త్రచికిత్సలకు అవసరమైన అధునాతన వైద్యపరికరాలు అందించనున్నది.
మరిన్ని వసతులు కల్పిస్తాం..
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లావాసిగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నా. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల సహకారంతో ఆసుపత్రుల్లో వసతులు కల్పిస్తున్నాం. మున్ముందు మరిన్ని ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తాం.
-డాక్టర్ రవిబాబు, డీసీహెచ్ఎస్, భద్రాద్రి జిల్లా
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు..
గతంలో ఏజెన్సీవాసులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. భద్రాచలంలోని ప్రభుత్వాసుపత్రి ఏజెన్సీకి వరం. మన రాష్ట్రంతోపాటు మరో మూడు రాష్ర్టాల ప్రజలు వచ్చి ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతారు. వైద్యారోగ్యశాఖ త్వరలో చర్ల పీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేయనున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హరీశ్‌రావు సహాయ సహకారాలతో జిల్లాలో ప్రభుత్వాసుపత్రులు బలోపేతమయ్యాయి.
– ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు