ఖమ్మం, జూన్ 12 : ఖమ్మం జిల్లాలో సన్నరకం వడ్లు అమ్మిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.53.27 కోట్ల బోనస్ డబ్బులను చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే మద్దతు ధర కాకుండా అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి రైతులు నిలువునా మోసపోయారు. యాసంగి ముగిసి వానకాలం సీజన్ ప్రారంభమైనా చేతికి బోనస్ నగదు అందలేదు. బోనస్‌కు ఆశపడి రైతులు సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. అధికంగా తరుగుపోతున్నా బోనస్ వస్తుందన్న వారి ఆశలు అడియాశలయ్యాయి. ధాన్యం అమ్మిన రెండ్రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని సీఎం మాయమాటలు చెప్పారని, మూడు నెలలుగా బోనస్ డబ్బులు రూపాయి కూడా పడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడో పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 351 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ వాటిలో 293 కేంద్రాల్లోనే విక్రయాలు చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో 131, పీఏసీఎస్ సొసైటీల ఆధ్వర్యంలో 134, మెప్మా ఆధ్వర్యంలో 2, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 26 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఈ యాసంగి సీజన్లో 15,085 మంది రైతుల నుంచి 10,65,285.60 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.53.27 కోట్ల బోనస్ డబ్బులను రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ.. ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గత సీజన్ నుంచే బోనస్ ఇవ్వడం ప్రారంభించింది. దీంతో రైతులు అనుకోని అదృష్టం తమ తలుపు తట్టిందని, వేలల్లో బోనస్ డబ్బులు వస్తాయని రైతులు ఎంతో ఆశపడ్డారు. దీంతో గత యాసంగి సీజన్లో దొడ్డురకం వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గించి ఎకువ విస్తీర్ణంలో సన్నరకం సాగు చేశారు. వీరి ఆలోచనలకు తగ్గట్టుగానే గణనీయంగా దిగుబడి పెరిగింది. రాష్ట్రంలో యాసంగి సీజన్లో సన్నరకం వడ్ల సాగు పెరుగుతుందని ప్రభుత్వం కూడా ముందుగానే ఊహించింది.
ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేసిన ప్రభుత్వం బోనస్ చెల్లించడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నది. బోనస్ డబ్బులు ఎప్పుడెప్పుడు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయా? అని ఎదురుచూస్తున్నారు. రేపోమాపో ఎప్పుడైనా బ్యాంకు ఖాతాల్లో బోనస్ డబ్బులు వచ్చిపడొచ్చని అధికారులు మూడు నెలలుగా చెబుతున్నప్పటికీ ఇంకా జమకాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
బోనస్ డబ్బుల కోసం ఆశపడిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. బయట మార్కెట్లో సన్న ధాన్యానికి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించారు. క్వింటా ధాన్యానికి రూ.500 అదనంగా బోనస్ వస్తుందనే ఆశతో ధాన్యాన్ని విక్రయించగా ఇంతవరకు ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇవ్వలేదు. మార్చి నుంచి మే నెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలను నిర్వహించారు. మిల్లర్లు క్వింటా ధాన్యానికి 5 శాతం తరుగు తీయడం వల్ల రైతులు నష్టపోయారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ తప్పకుండా నెరవేరుస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. కానీ.. బోనస్ డబ్బులు ఇప్పటి వరకు పడలేదు. ఇస్తారో ఇవ్వరో అనేది కూడా క్లారిటీ లేదు. వడ్లు అమ్మేందుకు ఎన్ని కష్టాలు పడ్డామో అందరికీ తెలుసు. ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. డాల్వ పంట వంద క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో బోనస్ వస్తుందని పోశాం. చాలా మంది రైతులు బోనస్ ఇస్తారనే నమ్మకం లేదని చెబుతున్నా వేస్తారనే నమ్మకంతో కొనుగోలు కేంద్రానికి తరలించాం. ఇంత వరకు అతీగతీ లేదు.
– కాపు హరిబాబు, రైతు, మొండికుంట, పెనుబల్లి మండలం
ధాన్యం కాటాలు వేసి సుమారు 50 రోజులకు పైగా అవుతున్నా బోనస్ పడలేదు. బోనస్ కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసి తేమశాతం వచ్చేంత వరకు మధ్యలో వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎన్నో కష్టాలు భరించాం. తీరా తేమ శాతం వచ్చిన తర్వాత లారీలు అందుబాటులో లేవు. బిల్లులు పడలేదంటూ మళ్లీ ఇబ్బందులు పెట్టారు. అయినా బోనస్ పడతది.. కాస్త తోడుగా ఉంటదని అనుకొని 260 క్వింటాళ్ల ధాన్యం పెనుబల్లి ఐకేపీ కేంద్రంలో విక్రయించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోనస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం.
– వెలివెల కృష్ణయ్య, రైతు, పెనుబల్లి