ఖమ్మం అర్బన్, జూలై 10: నిరుద్యోగులమైన తమతోనూ, తమ కుటుంబ సభ్యులతోనూ ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్.. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు మండిపడ్డారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చింది తామేనంటూ తప్పుడు ప్రచారాలు చేసుకోవడం, గ్రామ పాలన అధికారుల ఉద్యోగాలను వీఆర్వోలతో భర్తీ చేస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుండడం, జాబ్ క్యాలెండర్‌ను ఇంకా విడుదల చేయకపోవడం వంటి అంశాలపై.. ఖమ్మంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖమ్మంలోని గ్రంథాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపించారు. తాము 60 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలు అబద్ధాలేనని అన్నారు. అవి గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినవని గుర్తుచేశారు. ఆ 60 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిందీ, నియామక ప్రక్రియలు చేపట్టిందీ గత కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలకులు ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ లెటర్లు, అలాట్మెంట్ ఆర్డర్లు మాత్రమేనని జ్ఞప్తికి తెచ్చారు. ఇంతటి దద్దమ్మ ముఖ్యమంత్రిని తామెన్నడూ చూడలేదని విమర్శించారు.
నిరుద్యోగులను చీట్ చేశాడని ఆరోపించారు. తామే 60 వేల ఉద్యోగాలను ఇచ్చామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంకోసారి మాట్లాడితే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నో నెలల నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తమకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్ అంటేనే మోసం’, ‘చేతగాని ముఖ్యమంత్రీ తప్పుకో’, ‘గ్రామపాలన అధికారుల పోస్టులను వీఆర్వోలతో కాకుండా టీజీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలి’, ‘ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి’, ‘జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి’ అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. నాగేశ్వరరావు, రాజేశ్‌నాయక్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.