ఖమ్మం రూరల్, ఆగస్టు 08 : గత ఏడాది నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ముష్క రాజుతో కలిసి వివరాలు వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం ఆరింపుల గ్రామానికి చెందిన మెడ ఉప్పల ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ఆరేంపుల గ్రామానికి చెందిన మోతే శ్రీను, అదే గ్రామానికి చెందిన పవర్ తరుణ్ గత ఏడాది నుంచి ఈ సంవత్సరం జూన్ నెల వరకు తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండల పరిధిలో ఇంట్లోకి చొరబడి మహిళలను గాయపరిచి బంగారపు గొలుసులతో పరారయ్యేవారు. బైక్పై తిరుగుతూ ఆయా గ్రామాల్లో మహిళల మెడలోంచి పుస్తెలతాడు, నల్లపూసల తాడు లాక్కొని పారిపోయేవారన్నారు.
ఈ సంఘటనలకు సంబంధించి ఇప్పటికే కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచార మేరకు శుక్రవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు వద్ద నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి మూడు తులాల బంగారం గొలుసు, మరో ఒక తులం బంగారం గొలుసుతో పాటు నల్లపూసల తాడు రికవరీ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ఒక బైక్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన పేర్కొన్నారు.