బోనకల్లు, ఆగస్టు 06 : ఫేక్ అటెండెన్స్‌కు పాల్పడిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించని ఎంపీఓకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి బక్క సురేశ్, ఆళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లాది శ్రీనివాస్‌రావు డైలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్ ) యాప్‌లో ముఖ హాజరును తప్పుగా చూపించి ఉన్నతాధికారులకు పట్టుబడ్డారు. జూలై నెల పూర్తిగా ఫేక్ అటెండెన్స్ అప్లోడ్ చేశారు. దీన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో కలెక్టర్ చర్యలకు ఉపక్రమిస్తూ ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్, ఎంపీఓ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.