భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం వ్యవసాయం/ దమ్మపేట రూరల్/ అశ్వారావుపేట టౌన్, సెప్టెంబర్ 24: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావంతో నిన్నటివరకు చెదురుమదురు జల్లులు పడినప్పటికీ మంగళవారం సాయంత్రం భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, ఇల్లెందు, టేకులపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో జోరు వాన పడింది. ఖమ్మం నగరంలోనూ వాన దంచికొట్టింది. దీంతో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. ఖమ్మంరూరల్, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, కూసుమంచి తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. కాగా, వర్షాల్లేక బీటలు వారుతున్న వరి పంటకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది.
దమ్మపేట మండలంలో మంగళవారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బూరుగుగుంపు, జగ్గారం గ్రామాలకు చెందిన సుమారు ఎనిమిది మంది మహిళా కూలీలు రోజూ మాదిరిగానే వ్యవసాయ కూలి పనులకు వెళ్లారు. పొలంలో పనిచేస్తుండగా సమీపంలో పిడుగుపడింది. దాని తీవ్రతతో బూరుగుగుంపునకు చెందిన కట్టం నాగశ్రీ (22), సున్నం అనూష (23) అక్కడికక్కడే మృతిచెందారు. జగ్గారం గ్రామానికి చెందిన మడివి సీతమ్మ, ఊకే రత్తమ్మ, కల్లూరి రాతమ్మ తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన మరో ముగ్గురు క్షేమంగా ఉన్నారు. మృతులిద్దరూ అవివాహితలు.