కాంగ్రెస్ హయాంలో పొలాలు, చేల వద్ద పడిన నరకయాతన కళ్లముందే కదలాడుతున్నదని, వారి దరిద్రపుగొట్టు పాలన ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దని ఉమ్మడి జిల్లా రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో పదేళ్ల నుంచి రంది లేకుండా పంటలు పండించుకుంటున్నారు. 24 గంటల విద్యుత్‌తోపాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందుకుంటూ రెండు పంటలు వేసి లాభాలు గడిస్తున్నారు. గత కాంగ్రెస్ పాలనలో పొలాలకు నీళ్లు పెట్టేందుకు కరెంటు లేక రేయింబవళ్లు పడిగాపులు కాసేది. మళ్లీ మా పాలన వస్తే మూడు గంటల విద్యుత్ ఇస్తామని, రైతులు 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకొని పంటలు పండించుకోవచ్చని కాంగ్రెసోళ్లు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో అక్రమాలకు చెక్‌పడి, వ్యవస్థ పారదర్శకంగా నడుస్తుంటే.. దానిని రద్దు చేస్తామని చెప్పడంపై రైతులు ఆగ్రహిస్తున్నారు. పాత వ్యవస్థను తీసుకొచ్చి భూమాత పోర్టల్‌ను పెడతామనడంపై భగ్గుమంటున్నారు. వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెసోళ్ల అవసరమే తమకు లేదని, మళ్లీ బీఆర్ఎస్నే గెలిపించుకుంటామని ముక్తకంఠంతో అంటున్నారు. 24 గంటల కరెంటు, ధరణి పోర్టల్ ఉండాల్సిందేనని రైతులు చెబుతున్నారు.
మూడు గంటల కరెంటుతో రైతులు పంటలు పండించుకోవచ్చు. 10హెచ్‌పీ మోటర్లతో నీరు పారించుకోవచ్చు. ధరణి పోర్టల్‌ను తొలగించి దాని స్థానంలో భూమాత పోర్టల్‌ను తీసుకొస్తాం. కౌలు రైతుల కాలం పెడతాం. పటేల్, పట్వారీ వ్యవస్థను తెస్తాం.. అంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలపై ఉమ్మడి జిల్లా రైతాంగం భగ్గుమంటున్నది. గత పాలనలోనే కరెంటు లేక.. నీళ్లు రాక.. పంటలు పండక సతమతమైతే.. మళ్లీ పాత పాట పాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థతో కార్యాలయాల చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడ్డాం. దళారుల ప్రమేయంతో తీవ్రంగా నష్టపోయాం. మళ్లీ ఆ విధానం వద్దని కరాఖండిగా రైతాంగం చెబుతోంది. సీఎం కేసీఆర్ పాలనలో పదేళ్లుగా నిరంతరాయంగా అందించే 24 గంటల విద్యుత్‌తో రెండు పంటలు పండించుకుంటున్నాం. చెరువుల్లో పుష్కలంగా ఉన్న నీటిని పంటలకు వినియోగించుకుంటున్నాం. ధరణి పోర్టల్‌తో ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. తహసీల్దార్ కార్యాలయాల్లో గంటల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్లు, దళారుల ప్రమేయం లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు అందుతున్నాయి. భూములకు భద్రతతోపాటు మంచి ధర పలుకుతున్నాయి. ఎన్నికల సమయంలో పూటకో మాట.. గడియకో విధానాన్ని ప్రకటించే కాంగ్రెస్ నాయకుల మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మం. దరిద్రపుగొట్టు కాంగ్రెస్‌ను దరిదాపుల్లోకి రానివ్వమంటున్నారు. రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించి.. వివిధ పథకాలతో ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షానే నిలబడతాం. బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు మా బాధ్యతగా ఓటు వేస్తామని సాగు రైతులు ముక్తంకంఠంతో చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటినుంచి కరెంటు ఇబ్బంది లేదు. 24 గంటల కరెంటుతో పంటలు పండించుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంటు అంటున్నారు. మూడు గంటల కరెంటు అంటే సగం భూమి వదిలేసుకుని మిగతా సగాన్ని వ్యవసాయం చేసుకోవాలి. ఇప్పుడు 24 గంటల కరెంటుతో పొలాన్ని తడుపుకుంటున్నాం. మూడు గంటల కరెంటుతో పంటలు పండించుకోలేం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటుతో ఇబ్బందులు పడ్డాం. మళ్లీ ఆ ఇబ్బందులను చూడలేం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. మళ్లీ ఆ పాతరోజులు వద్దు. కేసీఆరే కావాలి. -గొర్లమారి సంజీవరెడ్డి, రైతు, కొత్తూరు, సత్తుపల్లి మండలం
తెలంగాణ ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో మా భూముల్లో రెండు పంటలు సాగుచేసుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంటు సరిపోతుందా అనడం రైతులకు నష్టం చేయడమే. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోమని చెబుతున్నారు. మూడు గంటల కరెంటుతో మడి కూడా తడవదనే విషయం వారికి అవగాహన లేదా…ఇది ఎలా సాధ్యం. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందుతుంది. మూడు గంటలు కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్‌ను నమ్మం. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.
పదేళ్ల క్రితం కాంగ్రెస పాలనలో కరెంట్ కష్టాలను కళ్లారా చూశాం. మళ్లీ వాళ్లు వస్తే మూడు గంటల కరెంట్ కూడా సరిగా ఇవ్వరు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నో బాధలు పడ్డారు. రైతుల ఇబ్బందులు పట్టించుకోని వాళ్లు ఎన్నికల్లో గెలవాలనే ఆశతో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసీఆర్‌కే మా మద్దతు. కాంగ్రెసోళ్లను నెత్తిన పెట్టుకొని కరెంట్ కష్టాలు మళ్లీ పడలేం. కారు గుర్తుకే ఓటు వేస్తా. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరే రావాలి.
తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌తో చాలా ప్రాధాన్యత ఉంది. వ్యవసాయ పంటలకు నీరు సరఫరా చేస్తూ పంటలు పండించుకుంటున్నాం. తెలంగాణ రాష్ర్టానికే కాక దేశానికి కూడా అన్నపూర్ణగా ఆవిర్భవించింది. రాత్రి, పగలు వెలుగులు నిండుతున్నాయి. రాత్రి కూడా నిరంతరం కరెంట్ సరఫరాతో సంతోషంగా ఉన్నాం. వ్యాపార, వాణిజ్య, పరిశ్రమ వర్గాల జీవనోపాధిని కల్పిస్తూ ముందుకెళ్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ పోతాయి. బీఆర్ఎస్కు ఓటు వేసి కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దాం
ముదిగొండ, నవంబర్ 25 : కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నాడనే దీమాతోనే తాము వ్యవసాయం చేస్తున్నాము. కాంగ్రెస్ పాలన ముగిసాక రైతుల కష్టాలు తీరాయి. నాడు కరెంటు లేక, నీల్లు లేక, ఎరువులు లేక నానా ఏడుపులు ఏడ్చినం మమ్మల్ని పట్టించుకున్న నాధుడే లేదు. కానీ ఇయ్యాల ఆ పరిస్థితి అలా లేదు. కరెంటు, నీల్లు, ఎరువులు ఇచ్చిందే కాక వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారు. రైతుకు ఇంత మేలు ఏ ప్రభుత్వమైనా చేసిందా.. ఎవరైనా మా వైపు కన్నెత్తి చూశారా.. ధర్నా చేస్తే తప్ప కరెంటు నీల్లు వచ్చేటియి కాదు. కానీ ఇయ్యాల అన్నీ ఇయ్యంగ మా పంటను కూడా ప్రభుత్వమే కొంటున్నది కరోనాలో పంట ఎలా అమ్ముకోవాలా అనుకుంటే మా ఊల్లేనే కొన్నరు. ఇంత చేస్తుంటే మాకు ఇంకేం కావాలి సారు ఉన్నడన్న దైర్యంతోనే మేము ఎవుసం చేస్తున్నం. బీఆర్ఎస్కే మా మద్దతు.
సీఎం కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది. 24 గంటలు కరెంట్‌తో మోటర్లు ఉన్న వారికి ఇబ్బంది లేదు. కరెంట్ ఉండడంతో రెండు పంటలు పండుతున్నాయి. చెరువులో నీళ్లు ఉంటే చెరువుల కింద కూడా పంటలు పండుతున్నాయి. కేసీఆర్ వచ్చాక రైతులకు కష్టాలు లేవు. ధరణి రాకపోతే రెవెన్యూ కార్యాలయం చుట్టూ పాస్ పుస్తకాల కోసం తిరగాల్సి వచ్చేది.
కాంగ్రెస్ పాలన వస్తే చీకటిమయం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు అంధకారమే. కాంగ్రెస్ పాలనలో రైతులు వ్యవసాయం చేయాలంటే నానా ఇబ్బందులు పడేవారు. రాత్రుళ్లు కరెంట్ లేక పొలంగట్లపై రైతులకు పాముకాటుతో ఎన్నో కుటుంబాలు బలి అయ్యాయి. కరెంట్ కోసం రోజంతా పడిగాపులు పడాల్సిన పరిస్థితి. కరెంట్, చెరువుల్లో, కుంటల్లో పుష్కలంగా సాగునీరు ఉండటంతో రైతులు ఎంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి.
కాంగ్రెస్ హయాంలో కరెంటు సరిగా లేక కళ్లముందే పంటలు ఎండిపోతుంటే ఇంజన్లు, జనరేటర్లు తెచ్చుకుని నీటిని పెట్టేవాళ్లం. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతే తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటల ఉచిత కరెంటుతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నాం. మళ్లీ కాంగ్రెస్ వస్తే తిరిగి జనరేటర్లు, ఇంజన్ల కాలం వస్తుంది. మాకు ఆ పరిస్థితి వద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
వామ్మో కాంగ్రెసోళ్లంటెనే కష్టాలు పెట్టెటోళ్లు. అప్పట్ల వాళ్లు సక్కంగ కరెంటియ్యక యమ గోస పెట్టిండ్రు. కేసీఆర్ వచ్చినంక కరెంటు కష్టాలన్నీ పోయినయ్. తెలంగాణ తెచ్చిన కేసీఆరే వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తుండు. ఆయనిచ్చే కరెంటే మాకు కావాలి. ఆయన గురించి కాంగ్రెసోళ్లు ఎన్ని మాటలు చెప్పినా వినే పరిస్థితే లేదు. వాళ్ల వల్ల నేనెంత గోస పడ్డనో నాకు బాగా తెలుసు. రేత్రిపూట కరెంటిస్తే చీకట్ల మూడు కిలోమీటర్లు ఉరికి చేనుకు చేరుకునేటోన్ని. ఈ మజ్జెల రాయిరప్పలు తగిలి ఎన్నిసార్లు కిందపడ్డా లేశి ఉర్కెటోన్ని. కేసీఆర్ వచ్చినంకనే ఈ బాధలన్ని పోయినయ్. ఇప్పుడు పగులు పూటనే పోయి చేనుకు నీళ్లు కట్టి వస్తన్న. ఇన్నేళ్లలో కాంగ్రెసోళ్లతో పడ్డ కష్టాలు మళ్లా రావొద్దు. అసలు వాళ్లు పెట్టిన కష్టాలకు నేను యగసాయమే మానేద్దామనుకున్నా. సరిగ్గ అదే టయానికి కేసీఆర్ వచ్చి అన్ని విధాలుగా మా రైతుల కష్టాలు తీర్చిండు. అట్లాంటి మా కేసీఆర్‌ను ఎట్లా మరిచిపోతం? ఆయన్నే మళ్లీ గెలిపించుకుంటం.
సీఎం కేసీఆర్ వచ్చినంకనే భూముల పట్టాలు, రిజిస్ట్రేషన్లు సింపుల్గ అయితన్నయ్. ధరణిని తెచ్చినంకనే తిప్పలు తప్పినయ్. అరగంటలో భూమికి పట్టా జేసి అరిచేతిల పెడతండ్రు. ఇలాంటి పద్ధతి ఇంతకుముందు ఎన్నడైన ఉన్నదా? గతంలో రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా ఇంత సింపుల్గ పనిగాలే. ఎన్నెన్ని కర్సులు పెట్టినా పట్టా వచ్చేది కాదు. పైగా ఏడాదికోసారి భూముల రికార్డులల్ల పేర్లు మార్చెటోల్లు. ఒకోసారి మా పేర్లు వాటిల్ల రాయకపోయేది. వీఆర్వో కోసం ఆఫీసుకెళ్తె దొరికెటోడు కాదు. ఇంకొకళ్లెవరూ సమాధానం చెప్పేవాళ్లు కాదు. ఈ గోసలన్నీ ధరణి పెట్టినంక పోయినయ్. మా పిలగాళ్లు ఫోన్లల్ల జూసి గూడ భూముల ముచ్చట చెప్తున్నరు. ఇంతమంచి ధరణిని ఎందుకు తీసెయ్యాలె. అట్ల తీసెయ్యాలనేటోల్లను రానియ్యొద్దు. వాళ్లు రాకుండ ఉండాల్నంటె కేసీఆర్ మళ్లా రావాలె.
రైతులకు సీఎం కేసీఆర్ చేసిన మేలు అంతా ఇంతా కాదు. భూములకు భద్రతను కల్పించేందుకు ధరణిని తీసుకొచ్చిండ్రు. ఏళ్లకేళ్లు తిరిగినా శిక్కు వీడని భూముల పంచాయితీలు సక్కగైనయ్. సాగునీళ్లకైతె ఎల్తే లేదు. వ్యవసాయానికి కరెంట్ కష్టాలైతె మొత్తానికే తొలిగిపోయినయ్. వేలి ముద్దెర పెట్టిన అరగంట కాకముందే పట్టా బుక్కు చేతికొత్తంది. ఆ వెంటనే రైతుబంధు వస్తంది. అయిబెట్టే గింజలు, పై మందులు తెస్తన్నం. వడ్లు కూడా వాళ్లే కొంటండ్రు. పొలం కాడికి వచ్చి మరీ కాటా పెట్టుకొని ఎల్తండ్రు. అసలు ఇవన్నీ ఇంతకుముందు ఎవరన్న జేసిండ్రా. ఇయ్యన్నీగాక రైతుబీమా అయితె ఎంతమంచి పథకమో. దేవుని కన్నుగుట్టి రైతు సచ్చిపోతె కుటింబమంత ఆగమయ్యేది. ఇందికనే కేసీఆరు రైతుబీమా తెచ్చిండు. రైతు సచ్చిపోతె రూ.5 లక్షల బీమా ఇత్తండు. అసలు ఇంతకుమునుపు ఇట్ల ఎవలన్న ఇచ్చిండ్రా? ఇసంటియన్ని రైతులు ఎందుకు వదులుకుంటరు? కేసీఆరుకే ఓటెస్తరు.
నాడు కరెంట్ కోతలతో పంటలు పండించాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందుల ఏవీ లేవు. రైతులకు కరెంట్ ముఖ్యం. 24 గంటల కరెంట్ ఉండాల్సిందే.. లేకపోతే మళ్లీ వ్యవసాయం కష్టంగా మారుతుంది. కరెంట్ కష్టాలతో వ్యవసాయం చేసుకోలేక పోయాం. కేసీఆర్ దయవల్ల ఇప్పుడు భావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. రెండు కార్లు పంటలు పడుతున్నాయి. నిరంతరాయంగా కరెంట్ రావడంతో ప్రజలకు రైతులు వినియోగదారులకు చాలా మంచి వసతి దొరికింది. ముఖ్యంగా సాగు రైతుల కష్టాలు కేసీఆర్ వచ్చిన తరువాతనే తీరాయి.
ధరణి రాక ముందు పైరవీ కార్లతో కలిసి పోతే సంత్సరాల తరబడి కాని పని ఒక్క రోజులో ధరణి వచ్చిన తరువాత అయిపోయింది. ఎవ్వరూ అవసరం లేకుండా నేరుగా మీ సేవలో వెళ్లి ఎలాంటి లంచాలు లేకుండా పని పూర్తి అయింది. సామాన్య రైతులకు ధరణి చాలా ఉపయోగం. కేసీఆర్ వచ్చిన తరువాతనే భూములకు రేట్లు వచ్చాయి. ప్రతి రైతుకు ధరణితో ధైర్యం వచ్చింది. రైతుబంధు, రైతుబీమా వచ్చింది. ధరణి రాకపోతే రైతు సాయం రాకుండేది. ఇన్ని సౌకర్యాలు ఇచ్చిన బీఆర్ఎస్కే మా మద్దతు.
ధరణి వచ్చినంకనే రైతులకు మంచిగున్నది ఏ పని కావాలన్నా పాస్‌పుస్తకం ఉంటే చాలు. గతంలో మాకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నా లోన్ కావాలంటే మల్లా తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులతో రాయించుకుని రమ్మనేవారు. వాల్ల కోసం తిరిగి తిరిగి యాష్టకొచ్చేది. కానీ ఇయ్యాల అట్లలేదు యాడికిపోయినా నా పాస్ పుస్తకం చూసి నేను ఏ పంట వేశానో కూడా చెపుతున్నారు. ఇదంతా కూడా ధరణి వల్లనే సాధ్యమైంది. మల్లా పాత పద్ధతిలో అంటే చానా కష్టాలు పడాలి. ఎవ్వల్ల కాడికిపోయినా మా రైతులను లెక్కచేయరు. ధరణి వచ్చినంకనే ప్రశాంతంగా ఉంటున్నాము. రుణం కోసం బ్యాంకుకు పోతే ఒక్క పూటలో పని అయితున్నది. ఆన్లైన్లోనే చూసి రుణం ఇస్తున్నారు. పాత పద్దతిని తెస్తే మల్లా రైతులు గోసపడాల్సిందే.
పెద్ద మోటరు పెడితే మూడు గంటల్లోనే పైరు తడుస్తదన్నది అసాద్యమైన మాట. అంత పెద్ద మోటరు పెట్టి నీల్లు తోడితే భూమిలో నీల్లు ఉండాల పోవాల్నా. ఒక్కసారి బావిలో నీల్లు అయిపోతే మల్లా ఒక పూట పడుతుంది నిండటానికి. ఇల్లా పొద్దూకులు నీల్లు అయిపోతుంటే భూగర్బ జలాలు అడుగంటి పోవా. అయినా అంత పెద్ద మోటరుతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏమున్నది. ఇయ్యాలా పొద్దున మోటరు వేస్తే మధ్యాహ్ననికి సాల్లు తడుస్తున్నాయి. మధ్యలో కాసేపు ఆగి మల్లా మోటరు వేస్తే చీకటి పడే కల్లా పొలమంతా తడుస్తున్నది. పెద్దమోటరు పెడితే ఆ పరిస్థితి ఉండదు సాల్లల్లో నీల్లు ఎక్కడైనా ఆగినా సరి చేయడానికి వీలు కాదు. ఇటు బావిలో నీల్లు అయిపోతున్నయో అని చూడాలా నీల్లు పారుతున్నయాల లేదా అని చూడాలా ఇయ్యన్నీ అయ్యే పని కాదు. కేసీఆర్ సారు అన్నీ ఆలోచించే 24 గంటల కరెంటు ఇస్తున్నడు. కాంగ్రెసోల్లు చెప్పేవన్నీ అయ్యే పనులు కావు. బీఆర్ఎస్ మళ్లీ అధికారం చేపట్టాలి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోనే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరంతరాయంగా కరెంటు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. పదేళ్ల క్రితం ఉన్న ప్రభుత్వాలు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించలేక చేతులెత్తాయి. పంటలకు నీరందక ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి. అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం గా బాధ్యతలు చేపట్టాలి..
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోదు. వ్యవసాయం తెలియని కాంగ్రెస్ నాయకులు అలా మాట్లాడతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటుతో వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం చేయాలంటే నానా బాధలు పడేవాళ్లం. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం ఉత్సాహంగా చేసుకుంటున్నాం. సాగుచేయడం సులభమైంది. రాత్రివేళల్లో పొలాలకు వెళ్లేపనిలేదు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు నానా బాధలు పడాలి. అందుకే నేను బీఆర్ఎస్కే ఓటు వేస్తా.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చినాకే వ్యవసాయానికి కరెంటు బాధలు తీరాయి. కాంగ్రెసోళ్ల పాలనలో కరెంటు కష్టాలతో వ్యవసాయం చేయలేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇస్తుండటంతో రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయి. సంతోషంగా బతుకుతున్నాం. మళ్లీ కాంగ్రెసోళ్లు వచ్చి మూడు గంటల కరెంటు చాలు, 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోండంటూ చెబుతున్నారు. కాంగ్రెస్ వద్దు…ఆ కరెంటు వద్దు..కేసీఆరే కావాలి.
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలు వాళ్లకు రైతుల కష్టాలు తెలుసా.. మూడు గంటల కరెంటుతో రైతులు పంటలు ఎలా పండిస్తారు. 24 గంటల విద్యుత్ ఇచ్చే కేసీఆర్ పాలన ఎక్కడ… మూడు గంటల కరెంటు ఎక్కడ.. ప్రజలు ఆలోచించుకోవాలి. మూడు గంటల కరెంటుతో పారిన కుంటే మళ్లీ పారుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయం చేయలేం. మాకు కాంగ్రెస్ వద్దు…వాళ్ల కరెంటు వద్దు.. మళ్లీ కేసీఆరే సీఎంగా రావాలి.
సొంత భూములు పట్టాలు కావాలంటే ఇబ్బందులు పడిన రైతులకు ధరణి రావడంతో ఎంతో భరోసా వచ్చింది. ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ ప్రయోజనం దొరకని సమస్యకు ధరణి వచ్చిన తరువాత ఒక్క రోజులో పాస ఫుస్తకం వస్తుంది. ఎవ్వరికీ లంచం ఇవ్వకుండా రైతు సొంతంగా ఎలాంటి పైరవీలు చేయకుండా పని అయిపోతుంది. గతంలో ఏండ్ల తరబడి తిరిగినా కాని పని ధరణితో వెంటనే అవుతుంది. పైద రైతాంగానికి ధరణి ఆధారంగా నిలిచింది. ధరణితో దళారుల రాజ్యం పోయింది. పైరవీ కార్లు లేరు. కేసీఆర్ వచ్చిన తరువాత పాస్ పుస్తకాలు ధరణిలో ఎలాంటి సమస్య లేకుండా అయిపోతున్నాయి.