Kothagudem | ఇల్లెందు, జూన్ 1 : ఇల్లెందు పట్టణంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టియుసిఐ, ఆఫీస్ బేరర్ల సమావేశం, ఆదివారం ఎల్లన్న భవనంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, ఇటు సింగరేణి అటు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతాల పెంపుదలపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటిన, కనీస వేతనాల జీవోను అమలు చేయడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచుతానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వారి జీతాలపై కనీసం నోరు మెదపటం లేదన్నారు. పట్టణాలకు దీటుగా ఈరోజు గ్రామ పంచాయతీలలో రోజుకు రూ. 300 ఇచ్చి పొద్దుందాక పని చేయించుకుంటున్నారని అన్నారు. ఈ వేతనాలతో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంవల్ల నిత్యవసర వస్తువులు కొనుక్కోలేకపోతున్నారని దీని మూలాన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల యెడల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాడు అనేక హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత అందాల పోటీలు పెట్టి అప్పులు చేసి వజ్రాల కిరీటాలు బహుమతులు ఇస్తూ మురిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కార్మికుల వేతనాల పెంపుదలపై నిర్ణయం తీసుకోకపోతే కార్మికులు ఉద్యమాలకు సిద్ధమవుతారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గోనెల రమేష్, వై గోపాలరావు, సహాయ కార్యదర్శి రూప భాస్కర్, పి సతీష్, కోశాధికారి పాయం వెంకన్న పాల్గొన్నారు.