టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో ఆరోపణలకు, నిందలకు తావులేదని, ప్రతిభే కొలమానమని స్పష్టం చేస్తున్నారు కమిషన్ రిక్రూటెడ్ ఉద్యోగులు. ఇప్పటి వరకూ జరిగిన అన్ని నియామకాల్లోనూ పారదర్శకతే ప్రథమ ప్రాధాన్యంగా ఉందని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టే ఉద్యోగ నియామక విధానాలు ఎంతో పటిష్టమైనవని చెబుతున్నారు. ఇప్పటి వరకూ నిర్వహించిన అన్ని నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియలో ఇదే ప్రస్ఫుటమైందని స్పష్టం చేస్తున్నారు.
నమస్తే నెట్వర్క్, మార్చి 22 : టీఎస్పీఎస్సీ వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన కల్పవృక్షం.. నిరుద్యోగులకు కల్పతరువు.. పకడ్బందీ ప్రణాళిక, అత్యాధునికత సాంకేతికతతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన భద్రత, నిఘా మధ్య కొనసాగుతున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక లంచాలు, పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రతిభే కొలమానంగా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఎలాంటి ఆరోపణ లేకుండా 37 వేల పోస్టుల భర్తీ జరిగింది. అలాంటి సంస్థపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వ్యక్తులు చేసిన తప్పును వ్యవస్థకు ఆపాదించేలా కుట్రలు చేస్తున్నాయి. అయితే టీఎస్పీఎస్సీపై దుష్ప్రచారం సరికాదని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. నిరుద్యోగులు నిరాశ చెందవద్దని పేర్కొంటున్నారు.
తొలి నోటిఫికేషన్లోనే ఎంపికయ్యా..
టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఎంత పారదర్శకంగా ఉంటుందో తొలి నోటిఫికేషన్లోనే కొలువు సాధించిన నేను చెప్పగలను. మాది టేకులపల్లి మండలం లచ్యాతండా. వ్యవసాయం చేసుకునే మా తల్లిదండ్రులకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. నేను ఐదోవాణ్ని. పెద్ద అన్న, మూడో అక్క బాగా కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు సాధించారు. వారి స్ఫూర్తితో నేనూ పట్టుదలతో చదివాను. టెన్త్ వరకూ సర్కారు బడే. పాల్వంచ ఆడమ్స్‌లో బీటెక్, వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి చదివాను. తెలంగాణ వచ్చాక 2016లో విడుదలైన తొలి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో పరీక్ష రాశాను. పరీక్ష ఎంతో పారదర్శకంగా జరిగింది. 2018లో మణుగూరు ఎంపీడీవోగా ఫస్ట్ పోస్టింగ్ వచ్చింది. ప్రస్తుతం కల్లూరు ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నాను. లక్ష్య సాధన కోసం పట్టుదలతో చదివితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఎంతో పకడ్బందీగా ఉంటుంది.
– బానోత్ రవికుమార్, 2016 గ్రూప్ వన్ అభ్యర్థి, కల్లూరు ఎంపీడీవో
ప్రతిభే కొలమానం..
మా స్వగ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా చిన్ననాటి కల. సమైక్య రాష్ట్రంలో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. స్వరాష్ట్రంలో ఎన్నో ఏళ్ల కష్టం ఫలించింది. కొలువు సాధించాలన్న సంకల్పంతో రేయింబవళ్లూ కష్టపడి చదివా. నా పట్టుదల, ప్రతిభకు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాన్ని ఇచ్చింది. నేను ఉద్యోగంలో చేరే ప్రక్రియలోనూ, విధి నిర్వహణ ప్రక్రియలోనూ ఎలాంటి లోటుపాట్లూ లేవు. నియామక ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా కొనసాగింది. మొదట జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించా. గ్రూప్-4 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి హోం డిపార్ట్మెంట్కు చెందిన పాల్వంచ 5వ బెటాలియన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాను. నాలాంటి ఎంతోమంది నిరుపేదలు పట్టుదలతో చదివి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు సాధించారు.
– బుయ్యా కల్పన, జూనియర్ అసిస్టెంట్, పాల్వంచ 5వ బెటాలియన్
చదువునే నమ్ముకున్నా
మాది ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలం మద్దులపల్లి గ్రామం. మాది పూర్తి వ్యవసాయ కుటుంబం. నాకూ వ్యవసాయమంటే మక్కువ. పట్టుదలతో బీఎస్సీ (సీఏబీఎం) చదివాను. గ్రూప్స్ పరీక్షలు రాసేందుకు ఒక సంవత్సరం కోచింగ్‌కు వెళ్లాను. 2016 నోటిఫికేషన్లో మొదటి ప్రయత్నంలోనే వ్యవసాయ విస్తరణ అధికారిగా ఉద్యోగం సాధించాను. పెనుబల్లి మండలం తాళ్లపెంటలో మొదటి పోస్టింగ్. టీఎస్పీఎస్సీ అనేది ఒక పటిష్టమైన వ్యవస్థ. ఇందులో ఉద్యోగాలు సాధించిన వారందరూ చదువును నమ్ముకున్న వాళ్లే. ఏళ్లకేళ్లుగా కుటుంబాలకు దూరంగా ఉండి, కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన వాళ్లమే. టీఎస్పీఎస్పీ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో టాలెంటే గీటురాయి తప్ప మరేమీ ఉండదు.
– గొడ్డుగొర్ల నాగరాజు, ఏఈవో, మద్దులపల్లి, ఖమ్మం రూరల్
మెరిట్ ఉంటే జాబ్ వచ్చినట్లే..
మాది మహబూబాబాద్ జిల్లా కే సముద్రం గ్రామం. నాన్న హమాలీ. ఒకటి నుంచి ఇంటర్ వరకూ ఏటూరునాగారం ప్రభుత్వ స్కూల్, కాలేజీలో చదివాను. హన్మకొండ ప్రభుత్వ డిగీ కాలేజీ డిగ్రీ, తర్వాత బీఈడీ చేశాను. ప్రైవేటుగా జాబ్ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివాను. ఏ కోచింగ్ సెంటర్‌కూ వెళ్లలేదు. టీఎస్పీఎస్సీ 2017 నోటిఫికేషన్ విడుదల కాగానే దరఖాస్తు పట్టుదలతో చదివాను. 2018లో పరీక్ష రాశాను. మెరిట్ ఆధారంగా జాబ్ వచ్చింది. కొత్తగూడెం గురుకుల పాఠశాలలో టీచర్‌గా జాయిన్ అయ్యాను. అదే నోటిఫికేషన్లో నాలాగే ఉద్యోగాలు సాధించిన వారు మా స్కూల్లోనే నలుగురు ఉన్నారు. నా మిత్రుల్లో పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందిన వారూ ఉన్నారు. ఏ నియామక ప్రక్రియలో ఎక్కడా ఇబ్బందులు లేదు. ఎంతో సవ్యంగా, పారదర్శకంగా జరిగింది.
– ధరావత్ రామన్న, మ్యాథ్స్ టీచర్, కొత్తగూడెం గురుకుల పాఠశాల
నిస్పక్షపాతంగా నియామక ప్రక్రియ..
మాది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పెనకుంట్ల గ్రామం. వ్యవసాయ కుటుంబం. మా అమ్మానాన్న నన్ను డిగ్రీ వరకూ చదివించారు. ఆ తర్వాత ఇదే మండలం కొత్తకారాయిగూడెం దొడ్డపునేని శేఖర్‌తో వివాహం జరిపించారు. వివాహం అయినప్పటికీ ఉద్యోగ సాధనే లక్ష్యంగా పట్టుదలతో చదివాను. 2010లో ఐసీడీఎస్‌లో అంగన్వాడీ టీచర్‌గా ఉద్యోగం పొందాను. గ్రేడ్-2 ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉన్నాను. అదే సమయంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. రేయింబవళ్లూ కష్టపడి చదివాను. మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రంలో 9వ ర్యాంకు, జోన్లో మూడో ర్యాంకు సాధించాను. టీఎస్పీఎస్సీది నిస్పక్షపాత పాత్ర అనేందుకు నేనే ఉదాహరణ. ప్రతిభ ఉంటే జనరల్ కోటాలోనైనా ఉద్యోగం సాధించవచ్చు.
– దొడ్డపునేని భవాని, గ్రేడ్-2 ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్, పెనుబల్లి
పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు..
మా సొంత ఊరు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి. మధ్య తరగతి కుటుంబం. మా నాన్న దివ్యాంగుడు, ప్రైవేట్ ఉపాధ్యాయుడు. ఆయన సూచనలతోనే పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాను. 2012 నుంచి పోటీ పడుతూనే ఉన్నాను. 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా విడుదలైన గురుకుల ఉపాధ్యాయుల పరీక్షల్లో ప్రతిభ చూపి ఉద్యోగం సాధించాను. టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుంది. ఇందులో అనుమనాలకు తావే లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల కల్పన జరుగుతోంది. 2018లో జరిగిన టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా జరిగింది.
– తోటమళ్ల రమాదేవి, టీజీటీ సైన్స్ టీచర్
ట్రాన్పరెన్సీగా రిక్రూట్మెంట్ సిస్టం..
మాది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామం. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌లో టాస్క్‌ఫోర్స్ ఎస్సైగా పనిచేస్తున్నాను. టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ సిస్టం మోస్ట్ ట్రాన్పరెన్స్గా ఉంటుంది. నా ఉద్యోగ నియామక ప్రక్రియ కూడా ఎంతో పారదర్శకంగా జరిగింది. 2016 నోటిఫికేషన్లో గ్రూప్-2 పరీక్షలు రాశారు. కోర్టు వివాదం కారణంగా అది కొంత ఆలస్యమైంది. 2019లో ఇంటర్వ్యూలు నిర్వహించి 2020లో పోస్టింగ్ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏ నియామక ప్రక్రియలోనూ ఇప్పటి వరకూ ఎలాంటి అవకతవకలూ జరగలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. దీనిలో పాలకమండలి సభ్యుల నియామకంలో తప్ప.. ఇతర ఏ అంశాల్లోనూ ప్రభుత్వ ప్రమేయం ఉండదు. ఇటీవలి ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలు విషయంలో వాస్తవాలు బయటకు రాకముందే ప్రభుత్వాన్ని తప్పుపట్టలేం. తాజా గ్రూప్-1 పరీక్షను నేను కూడా రాశాను. ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది.
– కొక్కిరేణి గౌతమ్, ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎస్సై, భద్రాద్రి జిల్లా
సమర్థవంతమైన వ్యవస్థ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎంతో పటిష్ఠమైన, సమర్థవంతమైన వ్యవస్థ. దానిపై ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. అది చేపట్టే ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎంతో పకడ్బందీగా ఉంటుంది. మాది కూసుమంచి మండలం ధర్మాతండా. నేను 2015 నోటిఫికేషన్లో పంచాయతీరాజ్ ఏఈగా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం రఘునాథపాలెం మండల పరిషత్‌లో ఏఈగా విధులు నిర్వహిస్తున్నాను. మేము పరీక్ష రాసినప్పుడు దాని నిర్వహణ ఎంతో కట్టుదిట్టంగా ఉంది. ఎప్పుడూ అలాగే ఉంటుంది. అంతటి పారదర్శకతను పాటించే వ్యవస్థ మీద ఇటీవల ఆరోపణల రావడం బాధాకరం. ఇటీవలి పరిణామాల్లో దోషులను కఠినంగా శిక్షించాలి. నిరుద్యోగులు అధైర్య పడకుండా మళ్లీ పరీక్షలకు సిద్ధం కావాలి. – జర్పుల చిరంజీవి, పీఆర్ ఏఈ, ధర్మాతండా, కూసుమంచి
సబ్జెక్టును ఎప్పుడూ విడిచిపెట్టలేదు..
మా స్వగ్రామం ఖమ్మం జిల్లా మధిర. అమ్మానాన్న వ్యవసాయ కూలీలు. ప్రభుత్వ ఉద్యోగం కోసం రెండేళ్లపాటు ప్రిపేర్ అయ్యాను. 2017 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రాగానే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. రోజూ ఆరేడు గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కే కేటాయించాను. అప్పటికే టీచింగ్‌లో అనుభవం ఉండడంతో సన్నద్ధత ఇంకొంచెం సులువైంది. సబ్జెక్టును మాత్రం ఎప్పుడు వడిచిపెట్టలేదు. ధ్యాసంతా ప్రిపరేషన్ మీదనే ఉంచడంతో మరో ఆలోచన లేకుండా విజయం సాధించాను. మెరిట్ ఆధారంగా పోస్టింగ్ వచ్చింది. ప్రస్తుతం ఇల్లెందులోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా ఉంటుంది.
– బీమపల్లి కృష్ణ, టీఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్