సారపాక, ఫిబ్రవరి 23: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విఫలమైన నాయకుడని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అని విమర్శించారు. ‘ఓటుకు నోటు’కు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్‌కు.. తనను విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలను రేవంత్‌రెడ్డి నిరూపించకపోతే అతడిపై పరువు నష్టం దావా వేస్తామని, అతడిపై అన్ని పోలీసు స్టేషన్లలోనూ ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇటీవల పినపాక నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్‌రెడ్డి.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ఈ మేరకు మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా మాట్లాడారు. 2009కి ముందు పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీయే లేదని, అప్పుడు తాను వచ్చే కాంగ్రెస్‌ను బలోపేతం చేశానని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యం చెందినందున నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లోకి వెళ్లినట్లు చెప్పారు. తాను పార్టీ మారలేదని, రాజ్యాంగబద్ధంగానే విలీనమయ్యామని అన్నారు. ఇటీవల కొందరు రూ.100 కోట్ల ఆఫరంటూ ప్రలోభపెట్టినా, వందమంది సెక్యూరిటీ అంటూ ఆఫర్ చేసినా తాను లెక్కచేయలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమేనని అన్నారు. అబద్ధాలని తేలితే రేవంత్‌పై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.
పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో రూ.100 కోట్ల నిధులతో 487 అభివృద్ధి పనులు చేపట్టామని ప్రభుత్వ విప్ కాంతరావు తెలిపారు. రూ.35 కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మిస్తున్నామని, పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ మణుగూరులో తొలిసారిగా నిర్వహించనున్నామని తెలిపారు. మార్చిలో మంత్రి కేటీఆర్ మణుగూరు వస్తారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, కుర్రి నాగేశ్వరరావు, కత్తి రాము, యాదగిరి గౌడ్, సంజీవరెడ్డి, పాకాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
సారపాక, ఫిబ్రవరి 23: దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరు మండలంలోని ఆయా గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 40 కుటుంబాల వారు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.