ఖమ్మం, జనవరి 31 : గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారికి సక్రమంగా అందించేందుకు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్‌తో కలిసి సీఎం గిరివికాసం, ప్రధానమంత్రి ఆది ఆవాస్ గ్రామయోజన, ట్రైకార్ పథకాలు, ఆర్వోఎఫ్ఆర్(డీఎల్సీ) పరిధిలోని వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్.. పీఎంఏఏజీవై పథకానికి మొదటి దశ రూ.2 కోట్లతో మంజూరు చేసిన ఇంజినీరింగ్ మరమ్మత్తు పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రెండో దశకు సంబంధించి రూ.2.40 కోట్లతో చేపట్టనున్న ప్రతిపాదిత పనులపై ఆయా శాఖలవారీగా సమీక్షించారు.
ట్రైకార్ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యూనిట్ల స్థిరీకరణలో పెండింగ్ యూనిట్లపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్కు సంబంధించి కొణిజర్ల, సింగరేణి, రఘునాథపాలెం మండలాల్లో పోడు పట్టాలు పొందిన తమకు సాగునీటి కోసం బోర్ వెల్స్‌ను అనుమతించాలని, మట్టి రోడ్లను నిర్మించాలని గిరిజనులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించిన కమిటీ ఆమోదం తెలిపింది. వన్యమృగాలను వేటాడటం నిషేధమని, వాటి కోసం అడవుల్లో ఉచ్చులు అమర్చినైట్లెతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏపీవో డేవిడ్ రాజ్, అటవీ, నీటిపారుదల, విద్యుత్, వైద్య, వ్యవసాయ, పీఆర్, రోడ్లు, భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు.