భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రోళ్లపాడు ఆయకట్టు కింద ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో పంటలు ఏటా నిలువునా ఎండిపోతున్నాయి. గోదావరి నీటితో తమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్న ఆ ప్రాంత ప్రజల ఎన్నోయేండ్ల కల.. కలగానే మిగిలిపోతున్నది. రోళ్లపాడు ప్రాజెక్టులోకి దుమ్ముగూడెం నుంచి గోదావరి నీటిని తరలించి అక్కడ నుంచి ఈ ప్రాంతానికి రెండు పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే నేటి కాంగ్రెస్ పాలకులు కుట్ర పన్ని గోదావరి- కృష్ణ జలాల అనుసంధానం పేరుతో గోదావరి నీటిని మళ్లించారు. జూలూరుపాడు నుంచి రోళ్లపాడుకు గోదావరి నీటిని తీసుకురాకుండా ఏన్కూరు వద్ద సాగర్ కాలువలోకి కలిపి మైదాన ప్రాంతంలో మూడోపంటకు నీటిని తరలిస్తున్నారు. ఇక్కడ తమ ఏజెన్సీ ప్రాంత పొలాలను ఎండగొట్టి.. మైదాన ప్రాంతానికి గోదావరి నీటిని తరలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గిరిజన రైతులు భగ్గుమంటున్నారు.
-ఇల్లెందు, మార్చి 30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ప్రకృతి సహజంగా చుట్టూ ఏర్పడిన గుట్టల మధ్యలో విశాలమైన ప్రాంతంలో రోళ్లపాడు ప్రాజెక్టు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1975లో రెండు గుట్టలను కలిపి బేతంపూడి ప్రాజెక్టు నిర్మించారు. దీని ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం లక్ష్యం. అయితే అప్పట్లో కాలువలు పూర్తిస్థాయిలో తీయకపోవడంతో 1,500 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందింది.
తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బేతంపూడినే రోళ్లపాడుగా పేరు మార్చి ఇందులో గోదావరి నీటిని నింపడం వల్ల గిరిజన ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు 2016లో శంకుస్థాపన చేశారు. రోళ్లపాడు ప్రాజెక్టులో గోదావరి నీటిని నిల్వచేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు వరంగల్ జిల్లాలో పలు గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందనున్నది. దీనిలో భాగంగా దుమ్ముగూడెం వద్దనున్న గోదావరి నుంచి జూలురుపాడు వరకు కాలువ కూడా నిర్మించారు. అక్కడి నుంచి రోళ్లపాడుకు కాలువ నిర్మించి నీటిని నింపాలి.
కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు కుట్ర పన్ని గోదావరి – కృష్ణ జలాల అనుసంధానం పేరుతో రీ డిజైన్ చేశారు. వారు అనుకున్న విధంగా జూలూరుపాడు నుంచి ఏన్కూరు వరకు చకచకా కాలువ నిర్మించి సాగర్ కాలువలో గోదావరి నీటిని కలిపారు. దీంతో భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి, సింగరేణి, కామేపల్లి, మహబూబాబాద్ జిల్లాలో కొన్ని మండలాలకు తీవ్ర అన్యాయం జరిగింది. తమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పాలకులపై గిరిజన రైతులు మండిపడుతున్నారు. రోళ్లపాడు ప్రాజెక్టులోకి గోదావరి నీటిని నింపి ఏజెన్సీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏజెన్సీకి నీళ్లిచ్చేందుకే ‘రోళ్లపాడు’
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఏజెన్సీ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు ఎంతో కృషిచేశారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో సహజ సిద్ధంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి రోళ్లపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గోదావరి నీటిని దుమ్ముగూడెం నుంచి తీసుకొచ్చి రోళ్లపాడులో నిల్వ చేసి ఏజెన్సీ ప్రాంతాలను సస్యశ్యామలం చేద్దామని అప్పటి మంత్రి తుమ్మలకు బాధ్యతలు అప్పగించారు. కానీ తుమ్మల రీడిజైన్ పేరుతో నీటిని తరలించడం అన్యాయం. ప్రస్తుతం కూడా మంత్రిగా ఉన్న తుమ్మల ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు దృష్టి సారించాలి.
– బానోత్ హరిప్రియానాయక్, మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు
మా ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలి
1975లో అప్పటి ప్రభుత్వం రోళ్లపాడు ప్రాంతంలో 3,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు బేతంపూడి ప్రాజెక్టును నిర్మించింది. కానీ కేవలం 1,500 ఎకరాలకు, అదీ ఒక్క పంటకు మాత్రమే నీరు అందుతున్నది. తెలంగాణ వచ్చాక గోదావరి నీటిని రోళ్లపాడులో నిల్వ చేస్తారని ఆశపడ్డాం. మా పంటలకు నీళ్లొస్తాయని ఎదురుచూస్తున్నాం. కానీ ఇప్పట్లో నీరు వచ్చేలా కనిపించడం లేదు. చాలా బాధగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి మా ప్రాంతానికి సాగునీరు అందించాలి.
– మహ్మద్ అబ్దుల్ ఖయ్యూం, బేతంపూడి గ్రామం, టేకులపల్లి మండలం
మంత్రి తుమ్మల వల్లనే ఏజెన్సీకి అన్యాయం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వల్లనే ఏజెన్సీ ప్రాంతానికి సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. రోళ్లపాడు ప్రాజెక్టుకు దుమ్ముగూడెం నుంచి గోదావరి నీరు రావాలి. కానీ రీడిజైన్ చేయించి గోదావరి నీటిని సాగర్ పారుతున్న మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టి ఇక్కడ పంటలకు నీరు ఇవ్వకుండా మైదాన ప్రాంతానికి తరలించడం అన్యాయం. ఏజెన్సీ రైతులు సాగునీటి కోసం ఉద్యమం చేపట్టకముందే ముగ్గురు మంత్రులు చొరవ తీసుకోవాలి.
– గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, ఇల్లెందు
పంటలు ఎండిపోతున్నాయి..
నాకు రోళ్లపాడు ప్రాజెక్టు కింద మూడు ఎకరాల పొలం ఉంది. ప్రతి ఏడాది యాసంగి వరి సాగు చేస్తున్నాను. ఈ సంవత్సరం పంటకు సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నాను. ప్రతి ఏడాది చివరితడి లేక పంట దిగుబడి తగ్గుతున్నది. కొంత పంట ఎండిపోతున్నది. గోదావరి నీళ్లు వస్తాయని ఆశపడ్డాం. కానీ నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.
– సామినేని రవి, టేకులపల్లి