భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 18 (నమస్తేతెలంగాణ): గ్యారెంటీ హామీల్లో రుణమాఫీ మీద గంపెడాశలు పెట్టుకున్న అన్నదాతలకు రిక్త‘హాస్తాన్నే’ మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. మూడు విడతల్లో మాఫీ చేశేశామంటూ గొప్పగా చెబుతున్న రుణమాఫీలో కనీసం 30 శాతం మంది రైతుల పంట రుణాలు కూడా మాఫీ కాలేదంటే అతిశయోక్తి కావడం లేదు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం చింతల్‌తండా అనే అతి చిన్న గిరిజన గ్రామమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.
85 కుటుంబాలున్న ఈ గ్రామంలో అందరూ రైతులే. 160 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. కానీ వారిలో కేవలం 35 మందికే కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ రైతుబంధు, రుణమాఫీ వంటి రైతు సంక్షేమ పథకాలు అందిన ఈ గ్రామంలో.. రేవంత్ సర్కారు వచ్చీరాగానే మొండి ‘చేయి’ చూపింది.
భూమాతను నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసుకుంటూ పంటలు సాగుచేస్తూ జీవించే ఈ గ్రామ రైతులకు మూడు విడతల రుణమాఫీలో తీవ్ర నష్టమే జరిగింది. ఎకరం, రెండెకరాలు సాగుచేసుకునే ఈ గిరిజన రైతులు రైతు రుణమాఫీ కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. మొదటి విడతలో తమ పేర్లు వస్తాయనుకున్నారు. రాలేదు. పోనీలే రెండో విడతలోనైనా వస్తాయనున్నారు. అందులోనూ రాలేదు. చివరికి మూడో విడత మీదనే ఆశలన్నీ పెట్టుకున్నారు. పక్కనే ఉన్న వైరాకు ఇటీవల వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మీద ఇక్కడి అన్నదాతలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ వారి ఆశలన్నింటినీ ఆయన అడియాశలు చేసి వెళ్లారు. మొత్తం 160 మంది రైతుల్లో కేవలం 35 మందికి మాత్రమే రుణమాఫీ చేసి ‘చేయి’ ఊపుకుంటూ వెళ్లారు. మూడు విడతల్లోనూ తమ పేర్లు రాకపోవడంతో మిగిలిన 125 మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులనూ కలిసి తమ పేర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ‘పేర్లు రానప్పుడు మేమేం చేయాలి?’ అంటూ వారు సమాధానమివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ధర్నా చేసైనా సరే తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరిలో ఒక్కొక్కరి పంట రుణాలూ రూ.1.04 లక్షలలోపే ఉండడం గమనార్హం.
వ్యవసాయ సీజన్ మొదలైందని, పంటలన్నీ అదునుమీద ఉన్నాయని అంటున్నారు గ్రామ రైతులు. ఈలోపు రుణమాఫీ అన్నారని, తీరా తమ పర్లేవీ రుణమాఫీ జాబితాలో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే విడతలో మాఫీ చేస్తామంటూ ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు మూడు విడతల్లో మాఫీ చేస్తోందని విమర్శిస్తున్నారు.
‘విడతల వారీగా జాబితా విడుదలైనప్పుడుల్లా అందులో మా పేర్లు చూసుకోవడం. అవి లేకపోతే వెంటనే బ్యాంకులు, సొసైటీల వద్దకు పరుగులు తీయడం తప్పడం లేదు. దీంతో పంటలు సాగు చేసుకోవాలా? బ్యాంకుల చుట్టూ తిరగాలా’ అంటూ ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ కింద భద్రాద్రి జిల్లాలో 57,983 మంది రైతులకు రూ.415 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని, ఇన్ని నిధులు మంజూరైనా గత కేసీఆర్ సర్కారు రైతుబంధు కింద ఒక సీజన్‌కు ఇచ్చినంత మొత్తం కూడా లేదని విమర్శిస్తున్నారు.
మధిర రూరల్, ఆగస్టు 18: రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు సంఘం మధిర పట్టణ అధ్యక్షుడు పాపినేని రామనర్సయ్య ఆరోపించారు. మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో అంగడాల అమరయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
కేవలం 40 శాతం మంది రైతులకే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నదని దుయ్యబట్టారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో రైతులతో ఉద్యమాలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్, రైతుసంఘం బాధ్యులు బాదినేని వెంకటనర్సయ్య, మస్తాన్, బ్రహ్మం, కృష్ణ, రైతులు పాల్గొన్నారు.
గత కేసీఆర్ సర్కారులో మా గ్రామంలో రైతులందరికీ రైతుబంధు వచ్చింది. కాంగ్రెస్ వచ్చాక పైసా కూడా చూడలేదు. ఊరంతా రైతులమే. మేం తీసుకున్నది రూ.లక్ష లోపు అప్పే. అయినా ఆ జాబితాలో మా పేర్లు లేవు. కలెక్టర్‌ను కూడా కలిశాం. బ్యాంకు వాళ్లు తిప్పుతున్నారు. ఇదేం అన్యాయం అండీ? కాంగ్రెస్ ఇలాంటి మోసం చేస్తుందని ఊహించలేదు.
-భూక్యా రాములు, మాజీ సర్పంచ్, చింతల్‌తండా
మాలాంటి పేద రైతులకు ఇంతటి అన్యాయం చేస్తారా? గిరిజన రైతులను ఇంతలా వంచిస్తారా? ఇలా మోసాలు చేస్తూ ఉంటే మేం పంటలను ఎలా కాపాడు కోవాలి. నోటికాడి అన్నం లాక్కుంటున్నారు కదా? కాంగ్రెస్ వాళ్లు ఇంత దాగా చేస్తారా? వీళ్లేం నాయకులు? మా ఊరు వచ్చి చూస్తే తెలుస్తది. మా కష్టమేంటని.
-భూక్యా శ్రీను, చింతల్‌తండా
ఒక ఊర్లో ఇంతమందికి రుణమాఫీ అవకపోవడం చాలా బాధగా ఉంది. చాలామందితో చెప్పాం. ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారులకూ చెప్పాం. వారు స్పందించడం లేదు. ఎవరికి వారు తప్పించుకుంటున్నారు. అప్పులు తీర్వకపోతే మాకు పురుగుల మందే గతి అయ్యేలా ఉంది. ఇంత దారుణంగా మోసం చేస్తారా? రేపు బ్యాంకు దగ్గర ధర్నా చేస్తాం.
-భూక్యా శంకర్, చింతల్‌తండా