దమ్మపేట, ఫిబ్రవరి 8 : కొండరెడ్ల గూడేల్లో మౌలిక వసతులు కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పూసుగుంట కొండరెడ్ల గ్రామంలో ఐటీడీఏ పీవో రాహుల్‌లో కలిసి కలెక్టర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గూడేల్లో చదువుకున్న యువత ఉంటే వారికి కంప్యూటర్, మొబైల్ రంగాలకు సంబంధించిన శిక్షణ ఇప్పించి ఆర్థిక వెసులుబాటు కల్పించాలని సూచించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల వైపు దృష్టి మళ్లించే విధంగా గిరిజనులను ప్రోత్సహించాలని, పశు పోషణ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టి పాల డెయిరీ సౌకర్యం కల్పించాలన్నారు.
వ్యవసాయ భూములు ఉన్న రైతులు అంతర్గత పంటగా ఆయిల్‌పామ్, కూరగాయలు, ఆకు కూరలు వేసుకునేలా చూడాలన్నారు. ఉమ్మడి కుటుంబాలతో నివసిస్తున్న వారికి పశువులు, మేకలు ఇప్పిస్తామని, వాటి మేత కోసం మునగ, వేరుశనగ, సుబాబుల్ మొక్కలు వేసుకునేలా శిక్షణ అందిస్తామన్నారు. గిరిజనుల భూ సమస్యలను పరిష్కరిస్తామని, ఆధార్ కార్డులు అందిస్తామని తెలిపారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని, నిరుద్యోగ యువతకు కావాల్సిన సిమెంటు పోల్ మేకింగ్ యూనిట్, ఇటుకల తయారీ మిషన్లు అందిస్తామన్నారు. అనంతరం గ్రామంలోని కమ్యూనిటీ హాలులో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పై అంశాలకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు రూపొందించి తనకు పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజు, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ వాణి, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్, ఐటీడీఏ డీఈ బాపనయ్య, డీఎఫ్‌వో కరుణాకరాచారి, జేడెం హరికృష్ణ పాల్గొన్నారు.