ఖమ్మం రూరల్, జూన్ 21: ‘అమ్మా.. మేమేం నేరం చేశామమ్మా? నీ పేగు తెంచుకొని పుట్టిన మమ్మల్ని నీ చేత్తోనే నువ్వు ఎలా చిదిమేయగలిగావమ్మా? నీకు, నాన్నకు మధ్య వచ్చిన పొరపచ్చాలకు, మనస్ఫర్దలకు మేమెలా బాధ్యులం అవుతామమ్మా? నీ కడుపున పుట్టినందుకు మాకు ఇంత శిక్ష వేశావేంటమ్మా?’ అంటూ కన్నుమూసిన చిన్నారులు తమ కన్నతల్లిని అడుగుతున్నట్లుగా వారి కుటుంబీకులు చేస్తున్న ఆర్తనాదాలు, శోకసంద్రంలో వేస్తున్న ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. స్వగ్రామానికి మకాం మార్చే విషయంలో భర్తతో ఓ భార్య పడిన ఘర్షణ చివరికి వారి పిల్లల ప్రాణాలను తీసేదాకా వెళ్లింది. అమ్మతనానికి మాయని మచ్చని మిగిల్చింది. ఖమ్మం జిల్లా కేంద్రంలో శని, ఆదివారాల్లో ఈ విషాదం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడుకు చెందిన బొబ్బిలి లింగరాజు, స్వాతి దంపతులు కొద్ది నెలల నుంచి ఖమ్మం త్రీటౌన్ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి వేదక్కుమార్ (7), తనీశ్ (4) అనే కుమారులున్నారు. లింగరాజు ఓ సెల్‌ఫోన్ షాపులో వర్కర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను షాపు నడపలేనని, అందుకని.. ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకోవాలని లింగరాజుకు ఆ సెల్‌ఫోన్ షాపు యజమాని చెప్పాడు. అయితే, లింగరాజు కూడా ఇదే విషయాన్ని భార్యకు చెప్పాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్లి వేరే పని చూసుకుందామని అన్నాడు. అయితే, భార్య స్వాతి అందుకు నిరాకరించింది. దీంతో ఇదే విషయమై రెండు రోజులుగా వారి గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భర్తపై కోపం పెంచుకున్న భార్య.. శనివారం తన భర్త లింగరాజు ఇంట్లో లేని సమయం చూసి.. బిస్కెట్లకు ఎలుకలమందు పూసి పిల్లలకు తినిపించింది. అనంతరం, తనకు ఏమీ తెలియనట్లు భర్తకు ఫోన్ చేసింది. పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని, వాంతులు అవుతున్నాయని, త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. దీంతో హుటాహుటిన ఓ మెడికల్ షాపునకు వెళ్లిన లింగరాజు.. వాంతులు తగ్గేందుకు ఓ సిరప్ తీసుకొని వెంటనే ఇంటికి వచ్చాడు. పిల్లలకు తాపించి పడుకోబెట్టాడు. విషం ప్రభావంతో పెద్ద కుమారుడు వేదక్కుమార్ శనివారం రాత్రి నిద్రలోనే కన్నుమూశాడు.
చిన్న కుమారుడు తనీశ్ ఆదివారం ఉదయం మళ్లీ వాంతులు కావడంతో ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ అతడు కూడా మరణించాడు. అయితే, పిల్లలకు పరిస్థితి విషమిస్తున్న తరుణంలో వారి తల్లి స్వాతి కూడా ఎలుకలమందు తిన్నట్లు తేలింది. దీంతో స్థానికులు ఆమెను కూడా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదంతంపై సమాచారం అందడంతో ఖమ్మం త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థానానికి వెళ్లి విచారణ చేపట్టారు. అయితే, సాక్షాత్తూ ఫాదర్స్‌డే రోజున ఓ తండ్రి తన పిల్లలను కోల్పోవడం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో వారి స్వగ్రామమైన గుర్రాలపాడులోనూ తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.