“ఇటీవల తిరుమల థియేటర్ సందులో ఓ వ్యక్తి పక్కకు పార్కింగ్ చేసి ఆసుపత్రిలో పని కోసం వెళ్లాడు.. అతడి ద్విచక్రవాహనంతోపాటు ఆ సందులో ఉన్న వాహనాల ఫొటోలను తీసి చలాన్లు వేశారు. ఆసుపత్రులు, వ్యాపార సముదాయాల వాహనాలను మాత్రం మినహాయించారు.”
“వైరా రోడ్డులోని పాత టూటౌన్ పోలీస్‌స్టేషన్ దగ్గర ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు రోడ్డు పక్కన పార్కింగ్ చేసి వెళ్లిన ఓ వాహనదారుడిని ద్విచక్ర వాహనాన్ని ఫొటో తీసిన ట్రాఫిక్ పోలీసులు దానికి ఏదులాపురం మున్సిపాల్టీ పరిధిలో రాంగ్ పార్కింగ్ చేసినట్లుగా చలాన్ వేసి జరిమానా విధించారు.”
“వైరా రోడ్డులో యూటర్న్ తీసుకునేందుకు వెళ్తున్న వాహనదారుడిని ఫొటో తీసిన ట్రాఫిక్ పోలీసులు రాంగ్రూట్లో డ్రైవింగ్, హెల్మెట్ లేదని ఏకంగా రూ.1,450 జరిమానా విధించారు.”
మామిళ్లగూడెం, జూన్ 6 : రహదారులపై ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవడం, వాహనదారులు ప్రశాంతంగా తమ గమ్యస్థానాలను చేరుకునేలా ట్రాఫిక్‌ను నియంత్రించడం ట్రాఫిక్ పోలీసుల ప్రధాన విధి. కానీ, వారికివేమీ పట్టవు.. ప్రభుత్వ ఖజానాను నింపడమే తమ టార్గెట్‌గా ప్రజలను పీడిస్తున్నారు. దొంగచాటుగా ఎడాపెడా వాహనదారుల ఫొటోలు తీస్తూ చలానాలు, జరిమానాలు విధిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పనిలో పనిగా చిరువ్యాపారుల దగ్గర నుంచీ పెద్దపెద్ద దుకాణాదారుల వద్ద రోజు, నెలవారీ మామూళ్లు వసూలు చేస్తూ.. ట్రాఫిక్ నియంత్రణను గాలికొదిలేసి మేమే మోనార్కులం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఖమ్మం నగరంలో ట్రాఫిక్ విధుల కోసం అటు అధికారులు, ఇటు సిబ్బంది పోటాపోటీ పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు విధులను వదిలి అటు ప్రభుత్వ ఖజానాను నింపడం.. ఇటు అక్రమార్జనకు పాల్పడుతున్న ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఖమ్మం నగర ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసుల తీరు చూసి ఖమ్మం నగరంలో వాహనదారులు రోడ్డు ఎక్కాలంటే భయపడిపోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని, హెల్మెట్ పెట్టుకోలేదని, తప్పుడు పార్కింగ్ చేశారని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారనే వివిధ కారణాలను చూపిస్తూ వాహనదారులకు ఎడాపెడా జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ ఖజానాను నింపుతున్నారు. చిన్నచిన్న గల్లీ రోడ్లలో తమ ఇండ్ల ముందు నిలిపిన వాహనాలను సైతం ఫొటోలు తీసి చలాన్లు వేస్తున్నారంటే పోలీసుల పనితీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఎస్ఐ స్థాయి నుంచి హోంగార్డు వరకు ట్రాఫిక్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఉన్నతాధికారులు టార్గెట్ విధిస్తున్నట్లు సమాచారం.
ప్రతిరోజు కనీసం 20 ఫొటోలు.. ఆపైన తీసి చలాన్లు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే వారు ఆ రోజు మంచిగా పనిచేసినట్లుగా ఉన్నతాధికారులు మెచ్చుకుంటున్నారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్నవారు ప్రజల రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా రోడ్ల మీద అడ్డదిడ్డంగా పార్కింగ్, తిరుగుతున్న వాహనాలను నియంత్రించి ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలి.. కానీ ఆ విధులను పక్కనపెట్టి కనపడిన ప్రతి వాహనాన్ని ఫొటో తీసి చలాన్ల రూపంలో జరిమానాలు విధిస్తున్నారు. ప్రశ్నించిన వాహనదారులపై దురుసుగా వ్యవహరించడంతోపాటు కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

ఖమ్మం నగరంలో ప్రధాన వ్యాపార సముదాయాలు ఉండే వైరారోడ్డు, కాల్వొడ్డు, గాంధీచౌక్, పీఎస్ఆర్ రోడ్డు, కమాన్‌బజార్, కస్బాబజార్, స్టేషన్‌రోడ్డు, బోనకల్ రోడ్డుల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు వ్యాపారులతో అక్రమ లావాదేవీలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్కింగ్ సెల్లార్లులో సైతం వ్యాపారాలు చేస్తూ వాహనాలను రోడ్డు మీద పార్కింగ్ చేస్తున్నప్పటికీ అధికారులు మాములుగా తీసుకుంటున్నారు. ప్రధానంగా వైరారోడ్డు, స్టేషన్‌రోడ్డు, కస్బాబజార్, కమాన్బజార్ల్లో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పక్కకు వాహనం నిలిపితే చాలు.. రాంగ్ పార్కింగ్ అంటూ జరిమానాలు విధిస్తున్నారే తప్ప సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ స్థలాలు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని వదిలిపెట్టి వాహనదారులకు చలాన్లు వేసే పనిలో ట్రాఫిక్ సిబ్బంది నిమగ్నమయ్యారు.
రోజువారీ, నెలవారీ మామూళ్లకు మరిగిన కొందరు ఖమ్మం నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహించేందుకు పోటాపోటీగా పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వీధుల వెంట పండ్లు, కూరగాయల వంటి చిరు వ్యాపారుల దగ్గర నుంచీ ఇడ్లీ బండ్లు, ఆటోవాళ్ల వరకు రోజువారీ వసూళ్లు.. పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, ప్రైవేటు ఆసుపత్రులు, దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలు ట్రాఫిక్ పోలీసులపై ఉన్నాయి. ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే వారికి ప్రభుత్వం అదనపు అలవెన్సులు ఇస్తుండడం గమనార్హం.

వాహనదారులను ఎడాపెడా ఫొటోలు తీస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఖమ్మం నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా బైపాస్ రోడ్డులో రాపర్తినగర్ బోర్డు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మయూరిసెంటర్, పాత బస్టాండ్, జడ్పీసెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డులో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, సెల్లార్స్ వ్యాపారాలు తొలగిస్తే కొంతమేరకు ట్రాఫిక్ నియంత్రణ అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నుంచి సరితా క్లినిక్, గట్టయ్యసెంటర్, టీడీపీ కార్యాలయం వరకు రోడ్డు మీద వ్యాపారాలు తొలగించాలని కోరుతున్నారు.

ఖమ్మం నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఓ సీఐ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కానిస్టేబుల్‌ను తన ఇంట్లో పనులు చేయిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఇటీవల పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రాఫిక్ నియంత్రణ సమయంలోనూ వాహనదారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు.