రఘునాథపాలెం, సెప్టెంబర్ 28 : కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను విస్మరించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా రేషన్డీలర్లు సోమవారం నిరసనకు దిగనున్నారు. 20 నెలలు పూర్తయినప్పటికీ హామీల ఊసే ఎత్తకపోవడంపై చేసేదిలేక ప్రభుత్వంపై పోరాటం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ విధానంపై అల్టిమేటం ప్రకటించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాలోని రేషన్డీలర్లంతా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేయనున్నట్లు రేషన్డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమియాలు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్డీలర్లకు క్వింటాకు రూ.300 కమీషన్తోపాటు నెలకు రూ.5 వేల గౌరవవేతనం ఇస్తానని ప్రకటించిందని గుర్తుచేశారు. 20నెలలు దాటినా రేషన్డీలర్ల సమస్యను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నదని, దీనిపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్డీలర్లు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.