భద్రాచలం, అక్టోబర్ 16: అయోధ్య రాముడి కరుణతో ముక్తి పొందిన గిరిజన మహా భక్తురాలు శబరి స్మృతియాత్ర భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఏటా ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి రోజు గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మహిళలు, యువతుల నృత్యాలు, ఆటపాటల నడుమ యాత్ర నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటల నుంచి గిరిప్రదక్షిణ, 8.30 గంటల నుంచి చిత్రకూట మండపంలో నిత్యకల్యాణం, 11.30 గంటలకు వివిధ రకాల పండ్లు, పుష్పాలతో రామయ్యకు పుష్పాంజలి కార్యక్రమం నిర్వహిస్తారు. గిరిజనులు తమ తమ గ్రామాలు, గూడేల్లో లభ్యమయ్యే పూలు, పండ్లను సేకరించి రామయ్యకు సమర్పించడం స్మృతియాత్ర ప్రత్యేకత.
భద్రాచలం ఈవోగా రమాదేవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన గ్రామాలకు ప్రచార రథాన్ని పంపించి అక్కడి ప్రజల మధ్య రామయ్య కల్యాణ మహోత్సవం నిర్వహించడం మొదలుపెట్టారు. దీంతో రామయ్య అందరివాడనే భావన కల్పించడం.. తమ ఇళ్ల ముంగిళ్లలోకి దేవుడే వచ్చాడని గిరిజనులు భావిస్తున్నారు.
ఈ ఏడాది అశ్వారావుపేట మండలం వినాయకపురంలో గురువారం శబరి స్మృతి యాత్ర ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు గ్రామంలో రామయ్య ప్రచార రథంతో శోభాయాత్ర నిర్వహించిన తర్వాత ముత్యాలమ్మ ఆలయంలో కల్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఏపీలోని వీఆర్పురం వద్ద ఉన్న శబరి నది సమీపంలో దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకం, వస్ర్తాలు, పండ్ల సమర్పణ కార్యక్రమం చేపట్టనున్నారు.