సోదరీ సోదర బంధానికి ప్రతీక ‘రక్షాబంధన్’. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రాఖీ వేడుకలు నిర్వహించుకునేందుకు జనం సిద్ధమయ్యారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలతోపాటు అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో సందడి నెలకొంది. రాఖీలు కొనుగోలు చేసిన వారితో దుకాణాలు కిక్కిరిసిపోయాయి.
అదేవిధంగా వస్త్ర దుకాణాలు, స్వీట్‌షాపుల వద్ద జనం ఎగబడ్డారు. ప్రధానంగా ఖమ్మం నగరంలోని కమాన్‌బజార్, గాంధీచౌక్, వైరారోడ్డు, కొత్తబస్టాండ్, కాల్వొడ్డు, ఇల్లెందు క్రాస్‌రోడ్డు, మమతా రోడ్డు, కొత్తగూడెంలోని ఎంజీరోడ్, పెద్దబజార్, చిన్నబజార్, గణేష్ టెంపుల్ ఏరియా, బస్టాండ్ సెంటర్, పోస్టాఫీస్ సెంటర్, విద్యానగర్ కాలనీలోని షాపింగ్‌మాల్స్ వద్ద జన సందోహం నెలకొంది. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు ప్రయాణమైన మహిళలతో బస్టాండ్ ప్రాంగణాలు నిండిపోయాయి. – నమస్తే నెట్వర్క్